అగ్రస్థానంలో తెలంగాణ
హర్షం వ్యక్తం చేసిన అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ గ్రీన్ విజన్, ప్రభుత్వ కృషి పట్టుదలకు సెంటర్ ఫర్
సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ విడుదల చేసిన నివేదిక సాక్ష్యం అని, ప్రపంచ
పర్యావరణ దినోత్సవ (జూన్ 5) సందర్భంగా తెలంగాణకు దక్కిన బహుమతి అని మంత్రి
అన్నారు. మిగతా రాష్ట్రాలను అన్నింటినీ వెనక్కు నెట్టి పది పాయింట్లలో తెలంగాణ
7.21 పాయింట్లు సాధించటం శుభ పరిణామం అన్నారు. తెలంగాణకు హరితహారం ద్వారా గత
తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు ఓవైపు కృషి చేస్తూనే మరోవైపు
అటవీ పునరుద్ధరణ ద్వారా పెద్ద ఎత్తున అడవుల్లో కూడా పచ్చదనం పెంచిన విధానానికి
సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఇచ్చిన నివేదిక అద్దం పడుతుందని మంత్రి
అన్నారు దేశంలో మరే ఇతర రాష్ట్రం సాధించని రీతిలో పచ్చదనాన్ని అటవీ
విస్తీర్ణంలో పెరుగుదలను తెలంగాణ నమోదు చేసిందని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ఫారెస్ట్ కవర్ గణనీయంగా పెంచటంపై గతంలోనే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన
నివేదికను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా –
స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు 2021 ప్రకారం రాష్ట్రంలో ఫారెస్ట్ కవర్ 6.85
శాతం, అదే సమయంలో రాష్ట్రం మొత్తం మీద పచ్చదనం (గ్రీన్ కవర్) 7.70 శాతం
పెరిగిందని మంత్రి తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న
వేళ రాష్ట్ర ప్రజలందరికీ ఇది శుభవార్త అని ఇదే ఉత్సాహంతో అన్ని రంగాల్లో
రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి ఇంద్రకరణ్
రెడ్డి ఆకాంక్షించారు.