రామచంద్రారెడ్డి
అనంతపురం : అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటిపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి స్పందించారు. రాజకీయంగా చంద్రబాబు నడవలేని స్థితిలో ఉన్నారని,
అందుకే నాలుగైదు పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు వెంపర్లాడుతున్నారని ఆయన
మండిపడ్డారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మంత్రి ఉషాశ్రీచరణ్
ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు
నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గడప గడపకూ మన
ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిన సందర్భంగా మంత్రి ఉషాశ్రీచరణ్ ఈ సమావేశం
నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి ఎంత మందితో చంద్రబాబు వచ్చినా వైఎస్సార్సీపీని ఏమీ చేయలేరని,
మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయం అన్నారు. చంద్రబాబు మహానటుడు అని,
మరోసారి ప్రజలను మోసం చేసేందుకు అబద్ధాల మ్యానిఫెస్టోతో ముందుకు వస్తున్నారని
ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ విమర్శించారు.