అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంకా ఎవరూ క్లెయిమ్ చేయని మృతదేహాలే భారీ
సంఖ్యలో ఉండటంతో వాటిని మార్చురీల్లో భద్రపరిచడం అధికారులకు సవాల్‌గా మారింది.
ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో తీరని శోకాన్ని
మిగిల్చింది. ఈ ప్రమాదమే మాటలకందని ఓ మహా విషాదం కాగా ఆ దుర్ఘటనలో మృతదేహాలు
గుర్తుపట్టలేని స్థితిలో మార్చురీల వద్దే గుట్టలుగుట్టలుగా పడి ఉండటం మరో పెను
విషాదం. శుక్రవారం రాత్రి బాలేశ్వర్ జిల్లాలో మూడు రైళ్లు ఢీకొట్టడంతో జరిగిన
దుర్ఘటనలో 275 మంది మృత్యువాత పడటంతో అత్యంత హృదయ విదారక పరిస్థితులు
నెలకొన్నాయి. రైలు ప్రయాణికుల్లో తమవారు ఏమయ్యారో.. ఎక్కడున్నారో తెలియక
కొందరు.. ఈ ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం
శోకసంద్రాన్ని తలపిస్తోంది. రైలు ప్రమాద తీవ్రతకు అనేక మృతదేహాలు ఛిద్రమైన
స్థితిలో గుర్తుపట్టలేనివిగా మారాయి. దీంతో మార్చురీల వద్ద భారీగా పేరుకుపోయిన
మృతదేహాలను భద్రపరచడం ఒడిశా అధికార యంత్రాంగానికి పెను సవాల్‌గా తయారైంది.
ఎవరూ క్లెయిమ్ చేయని మృతదేహాలే భారీ సంఖ్యలో ఉండంతో అధికారులు బాలేశ్వర్
నుంచి భువనేశ్వర్‌కు 187 మృతదేహాలను తరలించారు. అయితే, వీటిని భద్రపరిచేందుకు
శవాగారాల్లో స్థలం లేకపోవడంతో మృతుల బంధువులు గుర్తించేలా తగిన ఏర్పాట్లపై
అధికార యంత్రాంగం దృష్టిసారించింది.
ఎయిమ్స్‌పై ఒత్తిడి.. మన్సుఖ్కు ప్రధాని ఫోన్ : భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు
110 మృతదేహాలు తరలించగా.. మిగతా వాటిని కాపిటల్ ఆస్పత్రి, అమ్రి ఆస్పత్రి,
సమ్ ఆస్పత్రి సహా పలు ప్రైవేటు ఆస్పత్రులలో భద్రపరిచారు. అయితే, ఎయిమ్స్‌లో
గరిష్ఠంగా 40 మృతదేహాలను మాత్రమే ఉంచేందుకు సౌలభ్యం ఉన్నందున ఇంత భారీ సంఖ్యలో
వచ్చిన శవాలను భద్రపరిచడం అత్యంత సవాల్ అని అక్కడి అధికారి ఒకరు తెలిపారు.
అయితే, ఇందుకోసం అదనపు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. మృతదేహాలను వారి
కుటుంబ సభ్యులు/బంధువులు గుర్తించే వరకు భద్రపరిచేందుకు శవపేటికలు, ఐస్,
ఫార్మాలిన్ రసాయనాలను సేకరిస్తున్నారు. మృతదేహాలను భద్రపరిచే అంశంలో తమకు
ఉన్న ఇబ్బందులు, సవాళ్లను నిన్న ఘటనా స్థలిని పరిశీలించేందుకు వచ్చిన ప్రధాని
నరేంద్ర మోడీ దృష్టికి ఒడిశా అధికారులు తీసుకెళ్లినట్టు సమాచారం. అలాగే ఈ
వేడి వాతావరణ పరిస్థితుల్లో మృతదేహాలను భద్రపరచడం చాలా కష్టమైన పని అధికారులు
తెలిపారు. దీంతో వెంటనే ఆయన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో
మాట్లాడి ఎయిమ్స్‌లో మృతదేహాలను భద్రపరిచేలా తగిన ఏర్పాట్లు చేయాలని
సూచించినట్టు తెలుస్తోంది. తక్షణమే కేంద్ర ఆరోగ్యమంత్రి అర్ధరాత్రి వరకు
భువనేశ్వర్‌కు చేరుకొని అక్కడి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆ వెబ్సైట్లలో మృతుల ఫొటోలు, వివరాలు : ఒడిశా సీఎస్ ప్రదీప్ జెనా
మాట్లాడుతూ.. శనివారం 85 మృతదేహాలను భువనేశ్వర్‌కు తీసుకురాగా మరో 17 శవాలను
ఆదివారంతీసుకొస్తామన్నారు. అన్ని మృతదేహాలను భద్రపరిచేందుకు స్థలాభావం సమస్య
ఉన్నందున కోల్డ్ స్టోరీజీల్లో ఏర్పాట్లపై దృష్టిపెట్టినట్టు ఒడిశా ఆరోగ్యశాఖ
కార్యదర్శి శాలిని పండిట్ తెలిపారు. ఈ రైలు దుర్ఘటనలో బాధితులు పలు
రాష్ట్రాలకు చెందినవారు కావడంతో గుర్తించడం పెను సవాల్‌గా మారిందని సీఎస్
తెలిపారు. అందువల్ల ప్రయాణికుల వివరాలను స్పెషల్ రిలీఫ్ కమిషనర్,
భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్, ఒడిశా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్
అథారిటీ వెబ్సైట్లలో ప్రభుత్వం అప్లోడ్ చేస్తుందని తెలిపారు.
బంధువులు/కుటుంబ సభ్యులు గుర్తించేందుకు సులభంగా ఉండేలా మృతుల వివరాలు,
ఫొటోలను ఆయా వెబ్సైట్లలో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఫొటోలు చూడటానికి
ఇబ్బందికరమైన రీతిలో ఉన్నప్పటికీ ప్రమాదం తీవ్రత, ప్రత్యేక పరిస్థితులను
దృష్టిలో ఉంచుకొని వాటిని గుర్తించడం కోసమే పోస్ట్ చేస్తున్నామన్నారు. అయితే
ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమిషనర్ రాతపూర్వక అనుమతి లేకుండా ఎవరూ ఈ ఫొటోలను
ప్రచురించడానికి వీల్లేదని ఉన్నతాధికారులు చెప్పారు. అలాగే, భువనేశ్వర్‌లోని
మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ
కార్యాలయాన్ని సంప్రదించి మృతదేహాల సమాచారం పొందొచ్చని సూచించారు.