విజయవాడ : గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అన్ని రకాల సేవలను ప్రజలకు
అందుబాటులో ఉంచటం అభినందనీయమని కేంద్ర జల జీవన్ మిషన్ కార్యదర్శి విని మహాజన్
అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం జూపూడి, మైలవరం మండలం పొందుగుల గ్రామాలలో ఆమె
మంగళవారం పర్యటించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో పారిశుద్ధ్య
కార్యక్రమాలు, సురక్షిత మంచినీటి లభ్యత అంశాలలో కేంద్రం అందిస్తున్న నిధులతో
చేపట్టిన కార్యక్రమాలను ఆమె పరిశీలించారు. జూపూడి గ్రామం ఇప్పటికే బహిరంగ
మలవిసర్జన రహిత గ్రామంగా కేంద్రం గుర్తించిందన్నారు. అలాగే సురక్షిత మంచినీరు
కూడా గ్రామ ప్రజలకు అందిస్తున్న తీరును ఆమె అధికారులను అడిగి వివరాలు
తెలుసుకున్నారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్ర
ప్రభుత్వం ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరును, సచివాలయాలు
అందిస్తున్న సేవలను ఆమె కొనియాడారు. ఇటువంటి వ్యవస్థ రూపకల్పన చేసిన
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన అభినందనీయమన్నారు. గ్రామంలో
నిర్వహిస్తున్న రైతు భరోసా కేంద్రం, చెత్త నుంచి సంపద తయారు చేసే వ్యవస్థ కూడా
గ్రామీణ ప్రజల అవసరాలు తీర్చేందుకు బాగా ఉపయోగపడతాయన్నారు. ఆయా వ్యవస్థల
అధికారులతో ఆమె ముఖాముఖిగా మాట్లాడి పలు వివరాలను తెలుసుకున్నారు. చెత్త నుండి
సంపద తయారుచేసే కేంద్రాల పనితీరును ఆమె ప్రశంసించారు. గ్రామంలోని విద్యా
వ్యవస్థ గురించి అధికారుల నుంచి సమాచారం సేకరించారు. గ్రామీణ ప్రాంత ప్రజల
జీవన ప్రమాణాలు పెంచేందుకే కేంద్రం వివిధ పథకాలకు నిధులు అందిస్తోందని
పేర్కొన్నారు. గ్రామీణ మహిళల రక్షణ కోసం నియమించిన మహిళా సంక్షేమ కార్యదర్శితో
మాట్లాడుతూ గ్రామాల్లో మహిళల రక్షణకు తీసుకుంటున్న చర్యల వివరాలు సైతం ఆమె
పూర్తిస్థాయిలో తెలుసుకున్నారు. డాక్టర్ వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్
ద్వారా అందిస్తున్న వైద్య సేవలను కేంద్రంలోని వైద్యుల ద్వారా తెలుసుకొని
వారిని అభినందించారు. గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు పోషకాహారం వంటి అంశాలను
తెలుసుకునేందుకు గ్రామంలోని, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లతో
ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డ్వాక్రా మహిళలతోనూ ఆమె మాట్లాడారు. స్వయం సహాయక
సంఘాల పనితీరు బాగుంటేనే గ్రామీణ మహిళల జీవితాలు సంతోషంగా ఉంటాయన్నారు.
గ్రామాల అభివృద్ధికి వివిధ పథకాలకు వస్తున్న విధుల వివరాలను రాష్ట్ర
పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధానకార్యదర్శి బుడితి
రాజశేఖర్, కేంద్రం ప్రభుత్వ నిధులతో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు వివరించారు. కార్యక్రమంలో జాయింట్
కలెక్టర్ డా. పి.సంపత్‌కుమార్, సబ్ కలెక్టర్ అజిత్‌సింగ్, జిల్లా పంచాయతీ
అధికారి జే.సునీత, డిఆర్డిఎ పిడి కె.శ్రీనివాస్, ఎంపీడీవో రామకృష్ణ నాయక్,
తహశీల్దార్ సూర్యారావు, జూపూడి గ్రామ సర్పంచ్ కాకి దేవమాత, జడ్పీ వైస్ చైర్మన్
గరికపాటి శ్రీదేవి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.