ముఖ్యమంత్రి ఈనెల 9వ తేదీన రానున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి
రమేష్ వెల్లడించారు. గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాల్లో మంత్రి జోగి
రమేష్, ముఖ్యమంత్రి కార్యక్రమ సమన్వయకర్త ఎమ్మెల్సీ తలశిల రఘురాం, జిల్లా
కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా పోలీసు అధికారి పి జాషువా, గుడివాడ శాసనసభ్యులు
కొడాలి వెంకటేశ్వరరావులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా
అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
జిల్లాలో మూడు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలు విజయవంతంగా
నిర్వహించామన్నారు. గుడివాడ టిడ్కో గృహాలను ప్రారంభించేందుకు రాష్ట్ర
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనెల 9వ తేదీన రానున్నారన్నారు. బహిరంగ సభకు
వచ్చే ప్రజలకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా అందరూ సమన్వయంతో , పూర్తి బాధ్యతతో
అన్ని ఏర్పాట్లు సజావుగా చేసి విజయవంతం చేయాలన్నారు. కొడాలి వెంకటేశ్వరరావు
నేతృత్వంలో తొలిసారిగా టిడ్కో గృహాల ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి
స్వయంగా పాల్గొంటున్నారన్నారు. ఒకే చోట 8912 టిడ్ కో గృహాల కాలనీ ఏర్పాటు
కావడం చెప్పుకోదగ్గ విశేషమని, 30 వేల మందికి నీడనిచ్చే బృహత్తర
కార్యక్రమమన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడంతో ముఖ్యమంత్రి జీవితాంతం
గుర్తుండి పోతారన్నారు. ఈ టిడ్కో గృహాలు చూడ ముచ్చటగా బ్రహ్మాండంగా ఉన్నాయని,
అంతర్గత రహదారులు, మురుగు కాలువ వ్యవస్థ, విద్యుత్, మంచినీరు తదితర సౌకర్యాలు
అన్ని సమకూర్చబడ్డాయన్నారు. పక్కనే జగనన్న కాలనీ కూడా ఉందన్నారు. వేసవి
దృష్ట్యా బహిరంగ సభకు వచ్చే ప్రజలకు మంచినీరు, ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లు
కావాల్సినన్ని సిద్ధంగా ఉంచుకొని పంపిణీ చేయాలన్నారు.
బహిరంగ సభకు వచ్చిన ప్రజలను సురక్షితంగా వారి గమ్య స్థానాలకు తిరిగి చేర్చే
బాధ్యత తీసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు
అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు.
హెలిపాడు, బహిరంగ సభ ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. వేదికను సుందరంగా
తీర్చిదిద్దాలన్నారు. ప్రోటోకాల్ ఏర్పాట్లు ఎలాంటి లోటుపాట్లు లేకుండా
సజావుగా చేయాలన్నారు.
గృహాల ప్రారంభం సందర్భంగా లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమానికి
అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి
కలెక్టరేట్లో నిరంతరం పనిచేసే కంట్రోల్ విభాగాన్ని కూడా ఏర్పాటు
చేస్తున్నామన్నారు. హెలికాప్టర్ సిబ్బందికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు
చూడాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమం పూర్తి అయ్యేవరకు విద్యుత్
సరఫరాకు ఎలాంటి అంతరాయం కలుగకుండా పర్యవేక్షించాలన్నారు. బహిరంగ సభకు వచ్చే
ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చిన వెంటనే చికిత్స చేసేందుకు వీలుగా వైద్య
శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగ సభకు వచ్చే వాహనాలకు పార్కింగ్ కు
ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాల్లో పూల మొక్కలతో
సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. గుడివాడ పట్టణంలో చెత్తాచెదారాలు లేకుండా
పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి తొక్కిసలాట
జరగకుండా గ్యాలరీ ఇన్చార్జి అధికారులు బాధ్యత వహించాలని, బారికేడ్ ఏర్పాట్లు
పక్కాగా చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు,
మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, గుడివాడ ఆర్డిఓ పద్మావతి, పలువురు జిల్లా
అధికారులు పాల్గొన్నారు.