పోలాకి : వివిధ వర్గాల ప్రజలకు ఏది అవసరమో వాటిని నెరవేర్చడంలో ముందున్నానని
సీఎం వైఎస్ జగన్ మరోసారి నిరూపించుకున్నారని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్ఆర్సిపి
జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. గడిచిన మంత్రివర్గ
సమావేశంలో శ్రీకాకుళం జిల్లాకు పలు అంశాల్లో మేలు చేసే విధానపరమైన నిర్ణయాలు
తీసుకోవడంపై కృష్ణదాస్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. పలాసలో నిర్మాణం
పూర్తి చేసుకున్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ
హాస్పిటల్ కు 41 మంది మెడికల్ ఆఫీసర్లని నియమించడం ఎంతో గొప్ప విశేషమని
తెలిపారు. దీనివల్ల ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని
ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ వైద్య విధానపరిషత్ ను ప్రభుత్వ శాఖగా మార్చాలని
మంత్రివర్గం తీర్మానించటం వల్ల ఉమ్మడి జిల్లాలో 6,200 మంది ఉద్యోగులకు మేలు
జరగనుందని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించటం వల్ల జిల్లా
వ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న 1800 మందికి ప్రయోజనం చేకూరనుందని తెలిపారు.
12వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తుండటంతో జిల్లాలోని 40 వేల మంది
ఉద్యోగులకు మేలు కలగనుందని అన్నారు. మేనిఫెస్టోను దైవంగా భావించి ఇచ్చిన
హామీల్లో 99.5 శాతం అమలు చేసిన దేశంలో ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని
ప్రశంసించారు. మేనిఫెస్టోలను పార్టీ వెబ్సైట్ నుంచి తొలగించే తెలుగుదేశం
పార్టీ ఇప్పుడు కల్లబొల్లి మోసపూరిత వాగ్దానాలతో కొత్త మేనిఫెస్టోను తయారుచేసి
ప్రజలను మరోసారి మభ్య పెట్టేందుకు సిద్ధమవుతుందని కృష్ణదాస్ ఆ ప్రకటనలో
విమర్శించారు.