4 సంవత్సరాలలో 32 లక్షల 75 వేల మంది రైతుల నుండి 3 కోట్ల 10 లక్షల 50 వేల
మెట్రిక్ టన్నుల ధాన్యం ను కొనుగోలు
రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు
ఏలూరు : రాష్ట్రంలో ప్రస్తుత రబీ సీజన్ లో 15 లక్షల మెట్రిక్ టన్నుల
ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి
కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ అతిధి గృహంలో
గురువారం పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత రబీ సీజన్లో 20
లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యానికిగాను 28 వేల 402 కోట్ల
రూపాయల విలువైన 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, 28 వేల
200 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించామని, మిగిలిన 200 కోట్ల రూపాయలు
నిర్దేశించిన సమయంలోగానే అందిస్తామన్నారు. జయ బొండాలు రకం ధాన్యాన్ని కేరళ
వాసుల కోరికపై మన రైతులు పండించారని, వాటిని కేరళ రాష్ట్రానికి చెందిన వారు
నేరుగా రైతులకు సొమ్ము చెల్లించి కొనుగోలు చేయడంతో లక్ష్య సాధన
తగ్గిందన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతు నుండే ధాన్యం కొనుగోలు
చేసి సొమ్మును నేరుగా రైతుల అకౌంట్ లోకి జమ చేసేందుకు ధాన్యం కొనుగోలులో
కొత్త విధానాన్ని తీసుకువచ్చామన్నారు. ఈ విధానంలో రైతుకు రైస్ మిల్లర్లతో
ఎటువంటి సంబంధం ఉండదని, దీని కారణంచేత రైతులు ఎంతో లాభపడ్డారన్నారు.
ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు రైతుల నుండి కొనుగోలు చేయడమే కాక, రవాణా, గొనె
సంచులు, హమాలీ చార్జీల భారం రైతులపై లేకుండా ప్రభుత్వమే భరించిందన్నారు. గత
ప్రభుత్వం పౌర సరఫరాల శాఖకు చెందిన 4800 కోట్ల రూపాయలను పసుపు-కుంకుమ కు పంచి
పెట్టేండేదుకు నిధులు పక్కదారి పట్టించారన్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల సమయంలో 17 లక్షల 94 వేల మందిరైతుల
నుండి 2 కోట్ల 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 40 వేల 236
కోట్లు చెల్లించగా, తమ ప్రభుత్వం గత 4 సంవత్సరాలలో 32 లక్షల 75 వేల మంది
రైతుల నుండి 3 కోట్ల 10 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ను కొనుగోలు
చేసి 58 వేల 7 వందల 28 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. గత ప్రభుత్వం పౌర
సరఫరాల శాఖను 20 వేల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసిందన్నారు. తమ ప్రభుత్వం
కందిపప్పు ను గత ప్రభుత్వం 23 రూపాయల సబ్సిడీతో కేవలం గిరిజన ప్రాంతాలలో
మాత్రమే అందిస్తే, తమ ప్రభుత్వం 43 సబ్సిడీతో రాష్ట్రంలో అన్ని పేద కుటుంబాలకు
అందించామన్నారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందించిన బియ్యం
కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 5150 కోట్ల రూపాయల విలువైన బియ్యం ఉచితంగా
పంపిణీ చేశామన్నారు. రేషన్ సరుకులను ఎం.డి.యు వాహనాల ద్వారా పేదల గుమ్మం
వద్దకు తీసుకు వెళ్లి అందిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం ఇన్ని పనులు చేస్తూ
కూడా టిడిపి హయాంలో పౌరసరఫరాల శాఖ చేసిన అప్పులను కూడా తమ ప్రభుత్వం
తీర్చిందన్నారు.