ప్రారంభించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన ఆస్తమా బాధితులు
5 లక్షల మందికి ప్రసాదం సిద్ధం చేసిన బత్తిని సోదరులు
హైదరాబాద్ : మృగశిర కార్తెను పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లిలోని
ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు
బత్తిని హరినాథ్‌గౌడ్ నేతృత్వంలో పంపిణీ ప్రారంభం కాగా, మంత్రి తలసాని
శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. 24 గంటలపాటు కొనసాగే ఈ పంపిణీ కార్యక్రమంలో
చేపమందు తీసుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల
నుంచి పెద్ద ఎత్తున ఆస్తమా బాధితులు తరలివచ్చారు. దాదాపు 25 వేల మందితో నిన్న
సాయంత్రానికే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిక్కిరిసిపోయింది. వీరికి ఎలాంటి ఇబ్బంది
కలగకుండా జీహెచ్ఎంసీ, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లు చేశాయి. అల్పాహారం, భోజనాలు,
తాగునీరు సమకూరుస్తున్నాయి. చేప ప్రసాదం పంపిణీ కోసం మొత్తం 2.50 లక్షల
కొర్రమీను చేప పిల్లలను మత్స్యశాఖ సిద్ధం చేసింది. దాదాపు 5 లక్షల మందికి
సరిపడా చేప ప్రసాదాన్ని బత్తిని సోదరులు తయారుచేశారు.