సీఎం జగన్ ను కలిసిన ఏపీ ఎన్జీవో నేతలు
మీడియాతో మాట్లాడిన బండి శ్రీనివాసరావు
12వ పీఆర్సీ ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని వెల్లడి
పీఆర్సీ చైర్మన్ గా ఎవరిని నియమించినా అభ్యంతరం లేదని స్పష్టీకరణ
గుంటూరు : ఏపీ ఎన్జీవో నేతలు నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను
కలిశారు. బండి శ్రీనివాసరావు, శివారెడ్డి, ఇతర ఉద్యోగ నేతలు సీఎంను
కలిసినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ క్యాబినెట్
సమావేశంలో 12వ పీఆర్సీ ప్రకటించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు
తెలుపుకుంటున్నామని వెల్లడించారు. కాంట్రాక్టు ఉద్యోగులను
క్రమబద్ధీకరించినందుకు, బకాయిలు 36 విడతల్లో ఇచ్చేలా చర్యలు తీసుకున్నందుకు,
అన్ని జిల్లాల్లో ఒకే హెచ్ఆర్ఏ ఇచ్చినందుకు కూడా సీఎంకు కృతజ్ఞతలు
తెలుపుకుంటున్నామని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు
మంత్రులు, సీఎస్ కృషి చేశారని బండి శ్రీనివాసరావు కొనియాడారు. ఉద్యోగుల
కాంట్రిబ్యూషన్ లేని పెన్షన్ ఇవ్వాలని కోరామని వెల్లడించారు. అయితే
కాంట్రిబ్యూషన్ లేని విధానం భారమవుతుందని సీఎం చెప్పారని వివరించారు. జీపీఎస్
లో ఉద్యోగికి నష్టం జరిగినా ప్రభుత్వమే బాధ్యతను స్వీకరిస్తుందని అన్నారని
తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను స్వాగతిస్తున్నామని బండి
శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇక, పీఆర్సీ చైర్మన్ గా ఎవరిని నియమించినా
అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.