47 డిమాండ్లలో 37 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించినట్టు వెల్లడి
ఓపీఎస్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని సూచన
విజయవాడ : ఉద్యోగుల ఆందోళనలు, ఉద్యమాన్ని ముగించామని ఏపీ జేఏసీ అమరావతి
అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఇచ్చిన 47 డిమాండ్లలో 37
డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను
పునర్ వ్యవస్థీకరణ చేయాలని కోరుతున్నామని బొప్పరాజు పేర్కొన్నారు. ఓపీఎస్
విధానం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని అన్నారు. జీపీఎస్ అమలుకు
ముందు మరోసారి సమీక్ష చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. కాగా ఇవాళ ఏపీ
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కూడా సీఎం జగన్ ను
కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్
తీసుకువస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇప్పుడు ఓపీఎస్ తో సమానంగా
ప్రయోజనం కలిగించేలా జీపీఎస్ ను తీసుకువచ్చారని వివరించారు. ఉద్యోగులు రిటైర్
అయ్యాక భద్రత కల్పించేలా జీపీఎస్ తెచ్చారని తెలిపారు. జీపీఎస్
తీసుకువచ్చినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపామని వెంకట్రామిరెడ్డి
వెల్లడించారు. జీపీఎస్ విధానం దేశానికి రోల్ మోడల్ లా ఉంటుందని, జీపీఎస్ తో
నష్టం ఉండదని, మేలు జరుగుతుందని సీఎం చెప్పారని వివరించారు. ఇక ఇళ్ల స్థలాల
డిమాండ్ పై ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేశారని వెంకట్రామిరెడ్డి తెలిపారు.