ఉద్యోగుల వాటా పంపిణీపై అంతర్గత కమిటీ
ఏపీ జెన్కో, ఓహెచ్‌పీసీ మధ్య అంగీకారం
భువనేశ్వర్ : మాచ్‌ఖండ్ ప్రాజెక్టు ఎగువ, దిగువ ప్రాంతాల్లో మూడు
జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్
కార్పొరేషన్ (ఏపీ జెన్కో), ఒడిశా హైడ్రో పవర్ కార్పొరేషన్ (ఓహెచ్‌పీసీ)
పరస్పరం అంగీకారానికి వచ్చాయి. మాచ్‌ఖండ్ నదిపై జలవిద్యుత్ ప్రాజెక్టులను
సంయుక్తంగా నిర్మించాలని 23–10–2020న ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాల
మధ్య కుదిరిన ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా ప్రాజెక్టు పరిపాలనా
కమిటీ (పీఏసీ) ప్రప్రథమంగా శుక్రవారం భువనేశ్వర్‌లో సమావేశమైంది. ఈ సందర్భంగా
రెండు రాష్ట్రాల ఇంధన శాఖ అధికారులు, ఏపీజెన్కో, ఓహెచ్‌పీసీ ప్రతినిధులు
మాచ్‌ఖండ్ ప్రాజెక్టుపైనా, ఈ నదిపై నిర్మించనున్న ఇతర ప్రాజెక్టులకు
సంబంధించిన పలు అంశాలపై చర్చించి అంగీకారానికి వచ్చారు. ఇందులో భాగంగానే 98
మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యంతో మూడు ప్రాజెక్టులను సంయుక్తంగా
నిర్మించేందుకు ఏపీజెన్కో, ఓహెచ్‌పీసీ అంగీకరించాయి. ఈ సందర్భంగా పరస్పరం
అంగీకరించిన అంశాల్లో ముఖ్యమైనవి. ఇరు రాష్ట్రాల ఇంధన శాఖ కార్యదర్శులు ఇక
నుంచి పీఏసీ కోఛైర్మన్లుగా ఉంటారు.
ఏపీజెన్కో, ఓహెచ్‌సీసీ మేనేజింగ్ డైరెక్టర్లు పీఏసీ సభ్యులుగా
వ్యవహరిస్తారు. ఏపీజెన్కో, ఓహెచ్‌పీసీ మధ్య ఉద్యోగుల వాటాను 50 : 50
దామాషాలో ఉంచడానికి వీలుగా అంతర్గత కమిటీని నియమిస్తారు. ఈ కమిటీ 30
రోజుల్లోగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించనుంది. –మాచ్‌ఖండ్ జలవిద్యుత్
కేంద్రం యాక్సిలరీ ఎలక్ట్రిసిటీ లెవీ డ్యూటీని రద్దు చేసే విషయం
పరిశీలిస్తామని ఒడిశా ప్రభుత్వ అధికారులు అంగీకరించారు. పరస్పర అంగీకారంతో
విద్యుత్ వినియోగాన్ని సర్దుబాటు చేసుకునేలా అంగీకారం కుదిరింది. – హైడ్రో,
పీఎస్పీ ప్రాజెక్టులను త్వరితగతిన నిర్మించేందుకు అవసరమైన చర్యల నిమిత్తం
ప్రతి మూడు నెలలకు ఒకసారి పీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
ఏపీజెన్కో మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు, రాష్ట్ర ఇంధన శాఖ
సంయుక్త కార్యదర్శి బీఏవీపీ కుమార్ రెడ్డి, ఏపీ జెన్కో హైడల్ డైరెక్టర్
సత్యనారాయణ, చీఫ్ ఇంజినీరు సుజయ్ కుమార్, ఒడిశా ఇంధన శాఖ అదనపు కార్యదర్శి
నికుంద కుమార్ ధాల్, ఓహెచ్‌పీసీ ఛైర్మన్ బిష్ణు ప్రసాద్ శెట్టి, మేనేజింగ్
డైరెక్టర్ అమ్రేష్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.