అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లోనూ ఈ సేవల్ని ఉచితంగా పొందొచ్చు
గతేడాది ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా 2.32 లక్షల కాన్పులు
కేవలం కాన్పుల కోసమే రూ.247 కోట్లు ఖర్చు
ఆరోగ్య ఆసరా పథకం కోసం ఇప్పటివరకు రూ.1075 కోట్లు ఖర్చు
గర్భిణులకు జగనన్న ఎంతో మేలు చేస్తున్నారు
పౌష్టికాహారం ఇస్తున్నారు
ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణ
కాన్పులూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి
అల్ట్రాసౌండ్, టిఫా స్కానింగ్ సేవలు కూడా ఇకపై పూర్తిగా ఉచితం
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విడదల రజిని
ఆరోగ్యశ్రీ ద్వారా అల్ట్రాసౌండ్, టిఫా స్కానింగ్ సేవల్ని లాంఛనంగా
ప్రారంభించిన మంత్రి
గుంటూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇకపై
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో గర్భిణులకు
ఆల్ట్రాసౌండ్, టిఫా స్కానింగ్ సేవలు ఉచితంగా అందించబోతున్నామని రాష్ట్ర
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. గర్భిణులకు ఎంతో
ముఖ్యమైన అల్ట్రాసౌండ్, టిఫా స్కానింగ్ లను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ
ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ సేవలను లాంఛనంగా శుక్రవార
మంత్రి ప్రారంభించారు. మంత్రి విడదల రజిని చేతులమీదుగా ఆరోగ్యశ్రీ
అమలవుతున్న గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ సేవలను లాంఛనంగా
ప్రారంభించారు. ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణులకు అల్ట్రాసౌండ్, టిఫా
స్కానింగ్ సేవలు పూర్తి ఉచితంగా అందబోతున్నాయి. ఈ కార్యక్రమానికి మంత్రి
విడదల రజిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక గుంటూరు తూర్పు ఎమ్మెల్యే
షేక్ ముస్తఫా, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి, జీడీసీసీబీ చైర్
పర్సన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు, కలెక్టర్ వేణుగోపాల్‌రెడ్డి,
ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంధర్
ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. తొలుత మంత్రి గర్భిణులకు అల్ట్రాసౌండ్,
టిఫా స్కానింగ్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. స్కానింగ్ లు చేస్తున్న
తీరును స్వయంగా తెలుసుకున్నారు. గర్భిణిలతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
వారికి పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన
వేదిక పై మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ఈ రోజు నుంచి గర్భిణిలందరికీ
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో అల్ట్రా సౌండ్
, టిఫా స్కానింగ్ సేవలు ఉచితంగా అందుతాయన్నారు. ఎంతో ఖరీదైన ఈ సేవలను
ఇప్పటివరకు రోగులు డబ్బులు చెల్లించి చేయించుకోవాల్సి వచ్చేదని, ఇప్పుడు
ప్రభుత్వమే ఈ ఖర్చు భరిస్తుందని తెలిపారు. ఏటా 64వేల మందికిపైగా టిఫా
స్కానింగ్ అవసరం ఉంటుందని భావిస్తున్నామని, అందుకు దాదాపు 7 కోట్ల
రూపాయలు ఖర్చవుతుందని, ఆ మొత్తాన్ని ఇకపై ప్రభుత్వమే భరిస్తుందని
వెల్లడించారు.
జగనన్న ఎంతో మేలు చేస్తున్నారు
ఈ రాష్ట్రంలోని పేద రోగులకు జగనన్న ఎంతో మేలు చేస్తున్నారని మంత్రి
విడదల రజిని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కాన్పులకు ఆరోగ్యశ్రీ
వర్తించేది కాదని, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని ఆస్పత్రుల్లో ఉచితంగా
కాన్పులు చేస్తున్నారని తెలిపారు. ఇప్పుడు వైద్యుడు సిఫారుసు చేసిన ప్రతి
ఒక్కరికి టిఫా స్కానింగ్ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తారని
చెప్పారు. ఈ స్కానింగ్ కోసం ఒక్కొకరికి రూ.3వేలకుపైగా ఖర్చవుతుందన్నారు.
పేద గర్భిణి లకు ఇకపై ప్రభుత్వమే ఉచితంగా చేస్తుందన్నారు. ఈ టిఫా
స్కానింగ్ ద్వారా జన్యు లోపాలు, శిశువు అవయవలోపాలు, పిండంలో లోపాలు, పిండం
ఎదుగుదుల వంటి వాటిని పూర్తి స్థాయిలో ముందే తెలుస్తుందన్నారు. పిండం
ఎదుగుదలలో ఏవైనా అనుమానాలున్నా, గర్భిణిల కుటుంబ నేపథ్యం, వారి మెడికల్
హిస్టరీ.. ఇలా పలు అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ టిఫా స్కానింగ్ ను
వైద్యులు సిఫారసు చేస్తారన్నారు. అల్ట్రా స్కానింగ్ ప్రతి గర్భిణికి రెండు
సార్లు చేయాల్సిన అవసరం ఉంటుందని, ఈ స్కానింగ్‌లను కూడా పూర్తి ఉచితంగా
ఆరోగ్యశ్రీ ద్వారా అందించేలా జగనన్న నిర్ణయం తీసుకున్నారనన్నారు. ఈ రోజు
నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో
గర్భిణులకు ఉచితంగా ఈ సేవలు అందుతాయన్నారు.
పూర్తి బలోపేతంగా ఆరోగ్యశ్రీ
జగనన్న పాలనలో ఆరోగ్యశ్రీ పథకం పూర్తి బలోపేతమయ్యిందని మంత్రి
విడదల రజిని తెలిపారు. 2019 కి ముందుకు టీడీపీ పాలనలో కేవలం 1,059
చికిత్సలకు మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందేదనీ , ఇప్పుడు ఆ
సేవలను జగనన్న ఏకంగా 3,257కు పెంచారని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా
2022-23 సంవ్సరంలో ఏకంగా రూ.3,400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు
చేశామన్నారు. 2022-23లో ఆరోగ్యశ్రీ కింద ఏకంగా 2.32 లక్షల కాన్పులు
ఉచితంగా చేశామని, కేవలం గర్భిణి లకు చికిత్స అందించేందుకే రూ.247 కోట్లు
వెచ్చించామని వివరించారు. సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ లాంటి పథకాల
ద్వారా గర్భిణులకు నాణ్యమైన ఆహారాన్ని ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు.
ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానాన్ని జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా
తీసుకొచ్చారని, ఈ విధానం ద్వారా ప్రతి గ్రామంలోని గర్భిణిలకు ప్రత్యేకంగా
వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వ వైద్యులు
గ్రామాలకు వెళ్లి చికిత్స అందించే సమయంలో గర్భిణిలను పూర్తి స్థాయిలో
పర్యవేక్షిస్తారన్నారు.
ఏదో ఒక రోజు ఈ దేశం మొత్తం ఆరోగ్య ఆసరా అమలు
మంత్రి రజని మాట్లాడుతూ ఏదో ఒక రోజు ఈ దేశం మొత్తం ఆరోగ్య ఆసరా పథకాన్ని
అమలు చేయడం ఖాయమన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి
ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, 104 వాహనాలు, 108 వాహనాలు.. ఇప్పుడు
దేశవ్యాప్తంగా ఎలా అమలవుతున్నాయో.. అలానే ఆరోగ్య ఆసరా పథకం కూడా
ప్రభుత్వాలు అమలు చేసి తీరతయాని వెల్లడించారు. ఈ పథకం కింద రోగి
కోలుకునే సమయంలో ప్రభుత్వం ఆర్థిక భరోసాను కల్పిస్తోందన్నారు. ఈ పథకం
ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 17,54,000 మందికి పైగా ఆర్థిక ఆసరా
అమలు చేశామన్నా రు. అందుకోసం రూ.1075 కోట్లు వెచ్చించామన్నారు.
చంద్రబాబునాయుడుకు మంచి చేద్దామనే ఆలోచన ఏనాడూ లేదు
గత టిడిపి ప్రభుత్వంలో పేదలను ఆదుకునేందుకు ఎలాంటి చొరవ చూపలేదని మంత్రి
విమర్శించారు. చంద్రబాబునాయుడు పాలనలో పేద రోగుల కోసం ఎలాంటి పథకాలు
తీసుకురాలేదని, మంచి చేయాలనే ఆలోచనే లేని వ్యక్తి ప్రజలకు ఏం మేలు
చేస్తారని మంత్రి ప్రశ్నించారు. మహిళల కష్టాలు చంద్రబాబు నాయుడుకు
తెలీదని మండిపడ్డారు. మహిళలంటే కనీస గౌరవం టీడీపీకి లేదని తేల్చి
చెప్పారు. అప్పట్లో కాన్పులను కనీసం ఆరోగ్యశ్రీ పరిధిలోకి కూడా
తీసుకురాలేదని దుయ్యబట్టారు. జగనన్న మంచి మనుసున్న నాయకుడని, నిరంతరం
పేదల బాగోగుల గురించి ఆలోచిస్తారు కాబట్టే.. గొప్ప గొప్ప సంక్షేమ పథకాలను
అమలు చేయగలుగుతున్నారన్నారు.
పూర్తిస్థాయిలో గుంటూరు జీజీహెచ్ అభివృద్ధి
గుంటూరు సర్వజన ఆస్పత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని
మంత్రి విడదల రజిని ఈ సందర్భంగా తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా
అభ్యర్థన మేరకు క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ
ఇచ్చారు. నాడు- నేడు కింద జీజీహెచ్‌కు 500 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు.
ఇప్పటికే రూ.40 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని చెప్పారు. జీజీహెచ్‌లో
ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని, శరవేగంగా భవన నిర్మాణం
జరుగుతోందని వెల్లడించారు. త్వరలోనే ఈ బ్లాక్‌ను
ప్రారంభించుకోబోతున్నామని చెప్పారు.
పేదల ప్రభుత్వం మాదిః ఎమ్మెల్యేలు
గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాలి గిరి
మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తున్న ప్రభుత్వం
తమదని చెప్పారు. పేద రోగులను ఆదుకునేందుకు ఆరోగ్యశ్రీ ని పెద్ద ఎత్తున
అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అని కొనియాడారు. తూర్పు
ఎమ్మెల్యే ముస్తఫా గుంటూరు జీజీహెచ్ లో క్రిటికల్ కేర్ యూనిట్ కోసం
విజ్ఞప్తి చేశారు. కలెక్టర్, కమిషనర్ కుటుంబ సంక్షేమం, ఆరోగ్యశ్రీ
సీఈవో మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం
తీసుకుంటున్న చర్యలను వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా వైద్య
ఆరోగ్యశాఖ అధికారులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.