ప్రభుత్వమే ప్రతిపక్షాలను పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు తీసుకెళ్లాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
అమరావతి : పోలవరం సందర్శనకు బయలుదేరిన టీడీపీ బృందాన్ని మార్గమధ్యలోనే
పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలవరంలో
పర్యటిస్తే అరెస్టులు చేస్తారా? అని ప్రశ్నించారు. గతంలో పోలవరం పర్యటన
సందర్భంగా రాజమండ్రిలో తనను కూడా అడ్డుకుని అరెస్టు చేశారన్నారు. ఇప్పుడు
టీడీపీ నేతలు దేవినేని ఉమా, నిమ్మల రామానాయుడు తదితరుల అరెస్టులను
ఖండిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు పోలవరంలో పర్యటించకూడదా? అంటూ
ప్రశ్నించారు. పోలవరం నిర్మాణంలో జగన్ సర్కార్ ఏ తప్పు చేయకపోతే
భయమెందుకన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిపక్షాలను పోలవరం ప్రాజెక్టు
పరిశీలనకు తీసుకెళ్లాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.