రాజమహేంద్రవరం : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తండ్రి దివంగత ముఖ్యమంత్రి
వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ లో సుపరిపాలన
అందిస్తూ దేశానికే ఆదర్శనీయంగా నిలిచారని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ
శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా
అధ్యక్షులు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో నిర్వహించిన తూర్పు
గోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శంకుస్థాపన
కార్యక్రమానికి శనివారం హోంమంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రాజ మహేంద్రవరం
ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వెనుక రెండు ఎకరాల స్థలంలో నిర్మించనున్న
కార్యాలయానికి శనివారం ఉదయం హోంమంత్రి సమక్షంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి.
కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు,పార్టీ నేతలు
ఉత్సాహభరిత వాతావరణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి
తానేటి వనిత మాట్లాడుతూ ప్రతీ పార్టీకి జిల్లా కార్యాలయం ఎంతో ముఖ్యమన్నారు.
పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తూర్పు
గోదావరి జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో కార్యాలయ నిర్మాణ పనులకు
శంకుస్థాపన జరగడం పార్టీలోని అందరికీ ఎంతో సంతోషకరమన్నారు. త్వరలోనే నిర్మాణం
పూర్తిచేసి, కొద్ది నెలల్లోనే ప్రారంభించుకోవాలనే ధృడ సంకల్పంతో తామంతా
నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములుగా అవుతున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్
రెడ్డి పాలనను ప్రజలంతా స్వాగతిస్తున్నారని తెలిపారు. మహత్మా గాంధీ కలలు కన్న
గ్రామస్వరాజ్యాన్ని గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో ముఖ్యమంత్రి
వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సాకారం చేశారన్నారు. అలాగే నూతన జిల్లాల ఏర్పాటుతో
ప్రజలకు సుపరిపాలనను చేరువ చేశారన్నారు. ఈ నాలుగేళ్ల పాలనలో విద్య, వైద్య,
వ్యవసాయ రంగాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. కుల, మత, ప్రాంత,
పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు
అందిస్తున్నామన్నారు. దివంగత నేత వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా పాలన
అందిస్తున్న జగనన్నకు మరోసారి పట్టం కట్టడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని
తానేటి వనిత తెలిపారు.
జక్కంపూడి రాజా మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన తూర్పు గోదావరి జిల్లా కేంద్రం
రాజమహేంద్రవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 5-6 నెలల కాలంలో అత్యంత
సుందరమైన, అధునాతన కార్యాలయం ప్రారంభమవుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్
రాజశేఖర రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఆవిర్భవించిన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో అతి తక్కువ
కాలంలోనే రాష్ర్ట ప్రజలందరి ఆదరాభిమానాలు చూరగొని అప్రతిహతంగా ముందుకు
సాగుతోందన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దేశంలోనే ఎక్కడా అమలు
కానటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు, పాలనలో విప్లవాత్మక మార్పులను
తీసుకొచ్చారన్నారు. పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా
అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించాలనే నిర్ణయంలో భాగంగా తూ.గో.
ల్లా కార్యాలయాన్ని నిర్మించుకోబోతున్నామన్నారు.
రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ పార్టీని స్థాపించి, పోరాట
యోధునిగా ముందుకు సాగిన జగన్మోహన్ రెడ్డి పోరాట పటిమ తమకు ఆదర్శమని, అలాంటి
పార్టీలో ఉండటం తమందరికీ గర్వకారణమన్నారు. రాజమహేంద్రవరంలో జిల్లా పార్టీ
కార్యాలయం నిర్మాణానికి జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా నాయకత్వంలో
శంకుస్థాపన జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ వంద వసంతాలు
పూర్తిచేసుకుని చెక్కు చెదరకుండా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నామన్నారు.
నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్
రెడ్డి పాలన పట్ల ప్రజలంతా ఎంతో సంతృప్తిగా ఉన్నారని గడప గడపకు వెళ్లినపుడు
వెల్లడవుతోందన్నారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ప్రవేశపెట్టి, ప్రజలకు
సేవ చేయడం అంటే ఏమిటో చూపించారన్నారు. పార్టీని ఇంకా బలోపేతం చేయాలనే
ఉద్దేశంతో జిల్లా కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం సంతోషకరమన్నారు. ఈ
కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణు గోపాల్
కృష్ణ, జగ్గంపేట నియోజక వర్గం ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు, డిసిసిబి చైర్మన్
ఆకుల వీర్రాజు, రాజమండ్రి రూరల్ కో- ఆర్డినేటర్ గ్రీనింగ్ కార్పొరేషన్ చైర్మన్
చందన నాగేశ్వరరావు, రుడా చైర్ పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిలరెడ్డి,
రాజమహేంద్రవరం నగర అధ్యక్షులు ఆడపా శ్రీహరి, వైఎస్ఆర్సిపి పార్టీ సీనియర్
నాయకులు గుద్దే రఘు నరేష్, వివిధ విభాగాల చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ
కార్పొరేటర్లు, వార్డ్ ఇన్చార్జులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.