మంగళగిరి ఆప్కో తోట ప్రాంగణంలో నూతన విక్రయశాల ప్రారంభం
నేతన్న బాగుకోసం ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ : గంజి చిరంజీవి
ముఫైశాతం ప్రత్యేక రాయితీతో వస్త్ర విక్రయాలు : ఎంఎం నాయక్
గుంటూరు : రాష్ట్రంలోని అన్ని చిన్న నగరాలు, పట్టణాలలో తక్కువ ఖర్చుతో
ప్రయోగాత్మకంగా ఆప్కో విక్రయశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని రాష్ట్ర
పరిశ్రమలు, వాణిజ్య (చేనేత, జౌళి) శాఖ ముఖ్యకార్యదర్శి కె. సునీత తెలిపారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో గల ఆప్కో తోట ప్రాంగణంలో
ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఆప్కో నూతన షోరూమ్ ను ఆమె సోమవారం
ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ చేనేత వస్త్రాలు
అందుబాటులో ఉంచాలన్న నూతన విధానం మేరకు ఇలా తక్కువ వ్యయంతో సాధ్యమైనన్ని
ఎక్కువ షోరూమ్ లు ప్రారంభించనున్నామని వివరించారు. కార్యక్రమానికి ముఖ్య
అతిధిగా హాజరైన ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి మాట్లాడుతూ చేనేత కార్మికుల
ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. నేతన్న
నేస్తం పధకం ద్వారా ప్రతి ఒక్క నేత కార్మికుడు లబ్ధి పొందగలుగుతున్నాడన్నారు.
వ్యవసాయం తుదుపరి అత్యధికంగా అధార పడిన చేనేత రంగం పట్ల ముఖ్యమంత్రి ప్రత్యేక
శ్రద్ధను చూపుతున్నారన్నారు. చేనేత, జౌళి శాఖ సంచాలకులు, ఆప్కో ఎండి ఎంఎం
నాయక్ మాట్లాడుతూ నూతన విక్రయ శాలలో ప్రత్యేకంగా 30 శాతం రాయితీని అమలు
చేస్తున్నామని, చేనేత ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని
కోరారు. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన వెంకటగిరి, మంగళగిరి, ఊప్పాడ, మాధవరం,
చీరాల పట్టు చీరలు, బందరు, రాజమండ్రి, వెంకటగిరి కాటన్ చీరలు, పొందూరు
ధోవతులు, డ్రస్ మెటీరియల్స్, దుప్పట్లు, టవల్స్, లుంగీలు, పొందూరు,
చెరుకుపల్లి షర్టింగ్ మెటీరియల్స్ తో పాటు అన్ని రకముల చేనేత వస్త్రాలు ఇక్కడ
అందుబాటులో ఉన్నాయన్నారు. మరోవైపు ఆప్కో తోట ప్రాంగణంలో 50, 66 శాతం రాయితీతో
పలు రకాల నిల్వ వస్త్రముల విక్రయం కోసం క్లియరెన్స్ సేల్స్ కౌంటర్ ఏర్పాటు
చేసామని నాయక్ పేర్కొన్నారు. కార్యక్రమంలో లిడ్ కాప్ ఎండి డోల శంకర్, ఆప్కో
పాలకవర్గ సభ్యులు ఉదయగిరి వెంకటేశ్వర్లు, (కడప), ఆప్కో జిఎంలు యస్. తనూజ రాణి,
యం. నాగేశ్వరరావు, ప్రాంతీయ వాణిజ్య అధికారి రఘునందనరావు తదితరులు
పాల్గొన్నారు.