నెల్లూరు : ప్రతి ఒక్కరూ మాతృభాషకు పునరంకితం కావలసిన అవసరం ఉందని భారతదేశ
పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వి.ఆర్. కళాశాలలో
వెంకయ్యనాయుడు గురువు గారైన మోపూరు వేణుగోపాలయ్య స్మృత్యర్థం నెల్లూరులో
ఏర్పాటు చేసిన గురువుకు వందనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ
సందర్భంగా వారి జీవిత విశేషాలతో రూపొందించిన “ప్రవచన సుధాకరుని వేణునాదం”
పుస్తకాన్ని ఆవిష్కరించారు. చక్కగా పుస్తకాన్ని రూపొందించిన శ్రీ మోపూరు
వేణుగోపాలయ్య గారి ఆత్మీయ బృందం, రూపకల్పనా బృందాన్ని వారు అభినందించారు.
కార్యక్రమ ప్రారంభంలో చిన్నారులచే ఏర్పాటు చేసిన ఆన్నమయ్య కీర్తనల ఆలాపన
కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది.
వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మాతృభాషలోనే మన భావాలను సమగ్రంగా వివరించగలం. ముందు
మాతృభాష, తర్వాత సోదర భాష, అటుపైన పరభాష. సద్బుద్ధి, సదాలోచన, సద్వివేచనను
ప్రతి ఒక్కరూ అలవరచుకోవాలి. తల్లిదండ్రులు, గురువులు, సహచరుల పేరిట ప్రతి
ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి. పెద్దలను గౌరవించటం, ప్రకృతితో
కలిసి జీవించటం మన జీవన విధానంలో భాగం చేసుకోవాలి. కష్టపడి, ఇష్టపడి
పనిచేయటానికి మించిన విజయసూత్రం లేదు. విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకున్న
గురువులు మనకు ఉన్నారు. అదే మన దేశ సంస్కృతి. నా విద్యార్థి జీవితాన్ని,
రాజకీయ జీవన గమనాన్ని తీర్చిదిద్దిన అనేక మంది ఉపాధ్యాయులు, మార్గదర్శకుల
సహకారాన్ని గుర్తు చేసుకున్నప్పుడు వారి పట్ల కృతజ్ఞతా భావంతో నా మనసు
నిండిపోతుంది. ఎందుకంటే వారు స్వార్థరహితంగా నా జీవితానికి దిశానిర్దేశం
చేశారు. నేను ఎదగాలన్న ఆకాంక్ష తప్ప, వారి మనసుల్లో మరే ఇతర భావమూ లేదు. చాలా
మంది నేను తెలుగు బాగా మాట్లాడతాను అంటారు. వాక్పటిమను పొందింది నా స్వీయ
కృషితో అయినా, భాష పట్ల నా ఆసక్తి, అనురక్తి పెరగటానికి కారణం మాత్రం పోలూరి
హనుమజ్జానకీరామశర్మ, మోపూరు వేణుగోపాలయ్య అని చెప్పటానికి నేను
గర్వపడతానన్నారు.
విద్యార్థుల జీవితాలను ఉన్నత మార్గంలో నడిపేందుకు వారు తీసుకునే చొరవ ఎంతో
ఉన్నతమైనది. ఆరోజుల్లో వారు పాఠం చెప్పే తీరు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉండేది.
మాటలో స్పష్టత, విషయ పరిజ్ఞానం, కట్టిపడేసే మాటతీరు వెరసి వారు పాఠం చెబుతుంటే
శ్రద్ధగా లీనమై వింటూ ఉండిపోయే వాళ్ళం. సమయం కూడా తెలిసేది కాదు. ముఖ్యంగా నా
పట్ల వారు చూపించిన అభిమానం మరువలేనిది. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అవుతారని
ఆ రోజు వారికి తెలియకపోవచ్చు గానీ, గొప్పవాడిని అవుతాననే నమ్మకం వారికి నాకంటే
ముందే కలిగింది. నా నాయకత్వ లక్షణాలతో పాటు, మాట తీరును గమనించి వారు సూచనలు
చేసే వారు. ముఖ్యంగా నాడు వారు చేసిన సూచనలు రాజకీయాల్లో నాకు ఎంతగానో
తోడ్పడ్డాయి. విషయ పరిజ్ఞానం నా స్వయం కృషి అయినప్పటికీ, విద్యార్థిగా ఉన్న
సమయంలో వారు చేసిన సూచనల వల్ల నా మాటతీరులో వచ్చిన మార్పులు తర్వాత కాలంలో
ఎంతగానో తోడ్పడ్డాయి. పుస్తకాలను చదవమంటూ నాడు వారు చేసిన సూచన, నా విషయంలో
ఇప్పటికీ కొనసాగుతోంది. నేటికీ నిత్యవిద్యార్థిగా ముందుకు సాగే నా జీవితంలో
తొలి అడుగు వారి దగ్గరే పడింది. వేణుగోపాలయ్య ఉపాధ్యాయుడిగానే గాక రచయితగా,
ప్రవచనకర్తగా మహోన్నతమైన ఆధ్యాత్మిక సంపదను తెలుగు వారి అందించారు. ఆయన
ఎప్పుడూ సంపదను రూపాయల్లో లెక్క వేసుకోలేదు. అక్షరాల్లోనే కొలుచుకున్నారు.
అందుకే ఆధ్యాత్మికంగా అంతటి ఉన్నతులుగా నెల్లూరులో పేరు సంపాదించుకున్నారు.
మోపూరు వేణుగోపాలయ్య స్మృతికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ వారి
స్ఫూర్తితో యువతరం నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని
ఆకాంక్షిస్తున్నానన్నారు.