రోమ్ : ఇటలీ మాజీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోని (86) కన్నుమూశారు.
లుకేమియాతో బాధపడుతున్న ఆయనను గత శుక్రవారం ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స
పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా ఆయన ప్రొస్టేట్ క్యాన్సర్, హృదయ
సంబంధ సమస్యలతోనూ బాధపడుతున్నారు. 2020లో కొవిడ్ మహమ్మారి కారణంగా
ఆసుపత్రిపాలయ్యారు. ఆయన అంత్యక్రియలు స్వస్థలమైన మిలన్లో బుధవారం ప్రభుత్వ
లాంఛనాలతో జరగనున్నాయి. బెర్లుస్కోని 1936 సెప్టెంబరు 29న మిలన్లో ఓ
మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. న్యాయపట్టా అందుకున్నారు. ఒకప్పుడు ఆయన
క్రూజ్ షిప్లో గాయకుడిగా పనిచేశారు. తర్వాత నిర్మాణం, మీడియా రంగాల్లో
ప్రవేశించి వడివడిగా ఎదిగారు. అపర కుబేరుడిగా మారారు. రాజకీయాల్లో అడుగుపెట్టి
1994లో ‘ఫోర్జా ఇటాలియా’ అనే పార్టీని స్థాపించారు. అదే ఏడాది మొదటిసారిగా
ప్రధాని పదవిని చేపట్టారు. అయితే ఓ మిత్రపక్షం మద్దతును ఉపసంహరించుకోవడంతో ఆయన
ప్రభుత్వం అనూహ్యంగా 8 నెలలకే కూలిపోయింది. 2001లో రెండోసారి ప్రధానిగా
బాధ్యతలు స్వీకరించిన బెర్లుస్కోని పూర్తిగా ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నారు.
మూడోసారి 2008లో ప్రధాని పగ్గాలు చేపట్టారు. 2011లో దేశం ఆర్థిక సంక్షోభంలో
చిక్కుకున్నవేళ ఆయన అయిష్టంగానే పదవిని వీడాల్సి వచ్చింది.
వివాదాలు, విమర్శలూ ఎక్కువే : ఇటలీని ఎక్కువ కాలం పాలించిన నేత బెర్లుస్కోని.
సంపన్న నాయకుడిగా, మీడియా మొగల్‌గా పేరుగాంచారు. అంతర్జాతీయంగా దేశానికి మంచి
గుర్తింపు తెచ్చిన సమర్థ నాయకుడిగా ఆయన్ను అభిమానులు కీర్తిస్తుంటారు. అయితే
బెర్లుస్కోని చుట్టూ వివాదాలూ ఎక్కువే. సెక్స్ పార్టీలు, అవినీతికి సంబంధించి
ఆయనపై అనేక ఆరోపణలున్నాయి. సొంత సంపద, వ్యాపారాల వృద్ధికి అధికారాన్ని
దుర్వినియోగం చేశారని విమర్శలున్నాయి. ‘బుంగా బుంగా’ పార్టీలు, మైనర్లతో
శృంగారం తదితర అంశాలపై ఆయన పలు విచారణలూ ఎదుర్కొన్నారు. 2013లో జరిగిన ఓ
విందులో బెర్లుస్కోని మైనర్ నర్తకికి డబ్బులు, ఆభరణాలు ఇచ్చి శృంగారంలో
పాల్గొన్నారనే ఆరోపణలతో కేసు నమోదైంది. అందులో మిలన్ కోర్టు ఆయన్ను దోషిగా
తేల్చింది. తాము శృంగారం చేయలేదన్న బాధితురాలి వాంగ్మూలంతో ఈ సంచలనాత్మక
కేసులో బెర్లుస్కోని తర్వాత నిర్దోషిగా విడుదలయ్యారు.