సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకునే వారికి, పిల్లలను కనేవారికి కొన్ని
ప్రావిన్స్‌లు ప్రత్యేక సెలవులు ఇస్తున్నాయి. అయినప్పటికీ, పెళ్లికి చైనాలో
యువత ముందుకు రావడంలేదట. జననాల రేటు తగ్గుదలతో ఆందోళనలో ఉన్న చైనా ను మరో
కొత్త సమస్య కలవరపెడుతోంది. పెళ్లి చేసుకునేందుకు అక్కడి యువత ఆసక్తి
కనబరచడంలేదట. చైనా పౌర సంబంధాల వ్యవహారాల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల
ప్రకారం 2021తో పోలిస్తే 2022లో వివాహం చేసుకునే వారి సంఖ్య 10.5 శాతం
తగ్గిపోయింది. 2021లో 7.63 మిలియన్ల జంటలు వివాహం చేసుకోగా, 2022లో
6.8మిలియన్ల జంటలు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలిపింది. 1986 నుంచి ఇప్పటివరకు
చైనాలో నమోదైన వివాహాల్లో గతేడాదే అతి తక్కువ వివాహాలు జరిగినట్టు
వెల్లడించింది.
గత కొన్నేళ్లుగా చైనాలో జననాల రేటు తగ్గిపోతుండటంతో ఆందోళన వ్యక్తం చేసిన
ప్రభుత్వం.. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. పెళ్లిళ్లు చేసుకునేవారికి,
పిల్లలు కనేవారికి రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. అంతేకాకుండా,
గతేడాది దేశంలో కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో మిలియన్ల మంది యువత
ఇళ్లకే పరితమయ్యారు. దీంతో పెళ్లి చేసుకునే వారి సంఖ్య తగ్గిపోవడంతోపాటు,
జననాల రేటు కూడా పడిపోయింది. 2021లో వెయ్యి మంది జనాభాలో 7.52 జననాలు నమోదు
కాగా.. 2022లో ఈ సంఖ్య కేవలం 6.77గా ఉంది.
చైనా 1980 నుంచి 2016 వరకు దేశం మొత్తం వన్ చైల్డ్ విధానాన్ని పాటించాలని
ప్రజలను ఆదేశించింది. ఫలితంగా జననాల రేటు పడిపోతూ వచ్చింది. దీంతో అప్రమత్తమైన
ప్రభుత్వం 2016లో అధికారికంగా వన్చైల్డ్ పాలసీకి స్వస్తి పలికింది. అయితే,
చైనా ప్రభుత్వం పెళ్లి చేసుకునే వారికి, పిల్లలు కనేవారికి రాయితీలు
అందిస్తున్నప్పటికీ.. పెరిగిన జీవన వ్యయాల కారణంగా చైనా ప్రజలు ఇంకా వన్
చైల్డ్ పాలసీ వైపే మొగ్గుచూపుతున్నారు. ఈ కారణంగానే గతకొన్నేళ్లుగా జనాభా
వృద్ధిరేటులో భారీ క్షీణత నమోదవుతూ వస్తోంది.
జననాల రేటును పెంచేందుకు చైనా ప్రభుత్వం 20 నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్‌ను
ప్రారంభించింది. ఇందులో భాగంగా కొత్తగా పెళ్లి చేసుకునే వారికి పిల్లలను
కనేందుకు కొన్ని ప్రావిన్స్‌లలో ప్రత్యేక సెలవులు ఇస్తున్నారు. దాంతోపాటు
దేశంలోని స్పెర్మ్ బ్యాంక్‌లు ఆరోగ్యవంతులైన పురుషులు, కళాశాల విద్యార్థులు
తమ వీర్య కణాలను స్వచ్ఛందంగా ఇవ్వాలని కోరినట్లు వార్తలు వెలువడ్డాయి. అలాగే,
పెళ్లికాని యువతులు, ఒంటరి మహిళలు అండాలను భద్రపర్చుకోవడానికి, ఐవీఎఫ్
చికిత్సలను పొందేందుకు అనుమతించాలని రాజకీయ సలహాదారులు ప్రభుత్వానికి
సూచించినట్లు సమాచారం.