నెల్లూరు : జిల్లాలో పట్టణ ప్రాంతాల లేఅవుట్ లో జరుగుతున్న పేదల గృహ
నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ మున్సిపల్
కమిషనర్లను, హౌసింగ్ ఇంజనీర్లను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో పేదల కోసం
నిర్మిస్తున్న ఇళ్ళ నిర్మాణ ప్రగతిపై కలెక్టర్ శంకరన్ హాల్లో జాయింట్ కలెక్టర్
రొనంకి కూర్మనాథ్ తో కలిసి సమీక్ష చేశారు. ఈ సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ
పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లతో చర్చించి ఎక్కువమంది మేస్త్రీలు, కూలీలు
పనులు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మీ పరిధిలో కాంట్రాక్టర్లు
స్పందించకపోతే జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
లబ్ధిదారులకు రుణాలు మంజూరయ్యే విధంగా చూడాలని మెప్మా అధికారులను ఆదేశించారు.
ఆత్మకూరు ,కావలి మున్సిపాలిటీల పరిధిలో గృహ నిర్మాణ ప్రగతి తక్కువగా ఉండటంతో
సంబంధిత అధికారులను కలెక్టర్ గట్టిగా నిలదీశారు. కాంట్రాక్టర్ల సక్రమంగా పనులు
చేపట్టకపోవడం వల్ల ప్రగతి తక్కువగా ఉందని తెలపగా పేదల ఇల్లు కాంట్రాక్ట్
తీసుకుని అవి ప్రారంభించకపోయినా, మధ్యలో నిలిపివేసిన అలాంటి కాంట్రాక్టర్లపై
క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హౌసింగ్, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణాలను సక్రమంగా చేపట్టకపోతే కాంట్రాక్ట్ నుండి వారిని డీలింగ్
చేయాలని చెప్పారు. నెల్లూరు, కందుకూరు, బుచ్చిరెడ్డిపాలెం పట్టణాలలో గృహ
నిర్మాణ ప్రగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. గృహ నిర్మాణ పనులను తేలిగ్గా
తీసుకోవద్దని, గృహ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు.
రాబోయే 15 రోజుల్లో మంచి ప్రగతి సాధించాలని అన్నారు.
ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వికాస్ మరమ్మత్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్
విద్యాదరి, పలువురు మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ ఈ ఈలు, డిఇలు, ఏఈలు
పాల్గొన్నారు.