ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హెచ్చరిక
ఓఆర్ఆర్ టెండర్ వ్యవహారంలో రాజకీయ నాయకుడి మాదిరిగా అరవింద్ వ్యవహరం
అడిగిన సమాచారం ఇవ్వకుండా రాజకీయ నాయకుడిలా ఎదురు దాడి
హైదరాబాద్ : ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అరవింద్
కుమార్ మే 25న తనకు ఇచ్చిన లీగల్ నోటీసులను వెనక్కి తీసుకోకుంటే ఆయనపై
సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు
రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఓఆర్ఆర్ లీజుకు సంబంధించిన వ్యవహారంలో అరవింద్
కుమార్ పంపిన లీగల్ నోటీసుకు రేవంత్ తన అడ్వకేట్ ద్వారా మంగళవారం రిప్లై
ఇచ్చారు. అరవింద్ కుమార్ ఐఏఎస్ , మున్సిపల్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ,
మెట్రోపాలిటన్ కమిషనర్ గా వంటి శాఖల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఒక ఐఏఎస్ అధికారి ఏ విధంగా వ్యవహరించాలి, బాధ్యతలను ఎలా నిర్వహించాలి అనే
విషయంలో సర్వీస్ రూల్స్ ఉన్నాయి. కానీ అరవింద్ కుమార్ ఆ రూల్స్ పాటించకుండా
అడిగిన సమాచారం ఇవ్వకుండా ఫక్తు రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు.
ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ (కండక్ట్) 1968 ప్రకారం ఐఏఎస్ అధికారి రాజకీయ
ఉద్దేశాలు లేకుండా తటస్థంగా వ్యవహరించాలి. కానీ అరవింద్ కుమార్ అధికారి పార్టీ
తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నారు. నెహ్రూ ఓఆర్ఆర్ సగం భాగం నేను
ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మాల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది.
అధిక ఆదాయం వచ్చే ఆస్కారం ఉన్నా ఆ దిశగా అలోచన చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి
గండికొట్టి కేవలం రూ.7380 కోట్లకే ఐఆర్బీ సంస్థకు 30 ఏళ్లకు ఓఆర్ఆర్ టోల్
వసూలు టెండర్ కట్టబెట్టారు. అంతేకాకుండా ఐఆర్బీ టెండర్ కట్టబెట్టే క్రమంలో
అన్ని నిబంధనలు యాదేచ్ఛగా ఉల్లంఘించారు. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2031తో
ముగుస్తుంది.
30 ఏళ్లకు లీజుకు ఇస్తే 2031 తర్వాత మాస్టర్ ప్లాన్ మారుతుంది. దాంతో సమస్యలు
వస్తాయి. అంతేకాకుండా దేశంలో ఏ రహదారి టెడంర్ అయిన 15 – 20 ఏళ్లకు మించి
ఇవ్వలేదు. 30 ఏళ్ల సుదీర్ఘ కాలానికి కాకుండా 15-20 ఏళ్ల వరకే టెండర్ వ్యవధి
ఉండాలని నేషనల్ హైవేస్ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) సూచించింది. అయిన ఎన్ హెచ్ఏఐ
అభ్యంతరాలను కూడా లెక్క చేయకుండా 30 ఏళ్లకు టెండర్ కట్టబెట్టారు. నిబంధనలకు
విరుద్ధంగా ఐఏఎస్ అధికారి స్థానంలో ఒక రిటైర్డ్ ఆఫీసరును నియమించి ఓఆర్ఆర్
టెండర్ టెండర్ ప్రక్రియను పూర్తి చేశారు. టెండర్ ప్రక్రియ కొనసాగుతుండగానే
హెచ్ జీసీఎల్ (హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్) స్థానంలో హెచ్ఎండీఎను
తీసుకొచ్చారు. అంతేకాదు ఓఆర్ఆర్ టెండర్ కు సంబంధించిన బేస్ ప్రైస్ ఎంతో
వెల్లడించాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసిన అరవింద్ కుమార్ నుంచి ఎటువంటి
స్పందన లేదు. ఓఆర్ఆర్ పై ట్రాఫిక్, టెండర్ విలువను మదింపు చేసిన మజర్స్
నివేదికను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు. ఇవన్నీ టెండర్ల ప్రక్రియలో ఏదో
జరిగిందనే అనుమానాలకు బలం చేకూరుస్తుంది. ఈ నేపథ్యంలో ఒక ప్రజాప్రతినిధిగా
సంబంధిత వ్యవహరంపై స్పందించాల్సిన భాద్యత నాపై ఉంది. ఈ క్రమంలో కావాల్సిన
సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా తెలుసుకోవడానికి వెళ్తుంటే ఒక ప్రజాప్రతినిధిని అని
కూడా చూడకుండా సచివాలయానికి వెళ్లకుండా అడ్డగించి అరెస్ట్ చేయించారు. అడిగిన
సమాచారానికి సమాధానం ఇవ్వకుండా అరవింద్ కుమార్ రాజకీయ నాయకుడి మాదిరిగా ఎదురు
దాడికి దిగుతున్నారు. లీగల్ నోటీసులో తనపై పేర్కొన్న ఆరోపణలన్నీ బూటకమని
రేవంత్ పేర్కొన్నారు. అరవింద్ కుమార్ పంపిన లీగల్ నోటీసు ప్రజాస్వామ్య
స్ఫూర్తికే విరుద్ధం. అధికార పార్టీ అక్రమాలపై ప్రశ్నిస్తున్నందుకుగాను
అణిచివేసే క్రమంలో ఈ నోటీసు ఇచ్చినట్లు తోస్తుందన్నారు. తనకు నోటీసులిచ్చినా
ప్రజల తరఫున పోరాడుతూనే ఉంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.