నేవీ ఎయిర్స్టేషన్లకు రక్షణ కవచం
నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్(ఎన్ఏడీఎస్)ను ఐఎన్ఎస్ డేగాలో ప్రారంభించిన
తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా
విశాఖపట్నం : శత్రుదేశాల కుయుక్తులను తిప్పికొట్టేందుకు భారత నౌకాదళం ఆధునిక
పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తోంది.
ఇందులో భాగంగా యాంటీ డ్రోన్ సిస్టమ్‌తో పాటు నేవీ ఎయిర్‌ఫీల్డ్‌ను మరింత
పక్కాగా నిర్వహించే వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చింది. శత్రుదేశాల
డ్రోన్లను మట్టుపెట్టేలా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నేవల్
యాంటీ డ్రోన్ సిస్టమ్(ఎన్ఏడీఎస్)ను ఐఎన్ఎస్ డేగాలో తూర్పు నౌకాదళాధిపతి
వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా ప్రారంభించారు. భారీ డ్రోన్ల నుంచి
తూనీగల పరిమాణంలో ఉన్న మైక్రో డ్రోన్ల వరకు దేనినైనా సరే.. లేజర్ ఆధారిత
కిల్ మెకానిజం సహాయంతో గుర్తించి వెంటనే మట్టుపెట్టేలా ఈ వ్యవస్థను
రూపొందించారు.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) సహకారంతో దీనిని తయారు చేశారు. 360
డిగ్రీల కోణంలో 10 కిలోమీటర్ల పరిధిలో ఏ డ్రోన్ ఉన్నా దాన్ని జూమ్ చేసి
వివరాలు సేకరించేలా ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు అమర్చారు.
రేడియో ఫ్రీక్వెన్సీ, డిటెక్టర్ల సహకారంతో ఆ డ్రోన్లను గ్లోబల్ నేవిగేషన్
శాటిలైట్ సిస్టమ్ ద్వారా ఎవరు ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నారనే
సమాచారాన్ని క్షణాల్లో సేకరిస్తుంది. సమాచారం వచ్చిన వెంటనే శత్రు డ్రోన్ల
సిగ్నల్స్‌ను జామ్ చేసి దాన్ని నాశనం చేసేలా ఎన్ఏడీఎస్ పనిచేస్తుంది. యుద్ధ
నౌకల్లో ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు భారత నౌకాదళం చర్యలు
చేపట్టింది.
నేవీ ఎయిర్స్టేషన్లకు రక్షణ కవచం : పఠాన్‌కోట్ తరహా ఉగ్రదాడులు పునరావృతం
కాకుండా ప్రత్యేక వ్యవస్థను కవచంలా ఏర్పాటు చేసుకోవాలని భారత రక్షణ శాఖ
నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్)తో
ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నేవల్
ఎయిర్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్(ఎన్ఏఐఎస్ఎస్)ను అభివృద్ధి
చేశారు. నౌకాదళం ఎయిర్‌స్టేషన్ల పరిధిలోని భద్రతా వ్యవస్థను పూర్తిగా
అప్‌గ్రేడ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో మల్టీ లేయర్
సెక్యూరిటీ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చారు. దేశవ్యాప్తంగా మొత్తం 6 నేవీ
ఎయిర్స్టేషన్లలో ఈ ఎన్ఏఐఎస్ఎస్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
గోవాలోని ఐఎన్ఎస్ హన్సా, ముంబైలోని ఐఎన్ఎస్ షిక్రా, అరక్కోణంలోని
ఐఎన్ఎస్ రజాలీ, విశాఖలోని ఐఎన్ఎస్ డేగా, పోర్టుబ్లెయిర్‌లోని ఐఎన్ఎస్
ఉత్క్రోష్, కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడను ఎంపిక చేశారు. సోమవారం విశాఖలోని
ఐఎన్ఎస్ డేగాలో ఈ కొత్త భద్రతా వ్యవస్థను ప్రారంభించారు. ఈ ఎయిర్‌స్టేషన్‌లో
స్మార్ట్ ఫెన్స్‌ను అమర్చారు. దీనిని సీసీ కెమెరాలకు అనుసంధానం చేశారు. ఈ
స్మార్ట్ ఫెన్స్ లోపలికి ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్‌తో సహా ఏది
ప్రవేశించినా వెంటనే కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేస్తుంది. సెకన్ల వ్యవధిలో
మొత్తం వ్యవస్థకు సమాచారం అందజేస్తుంది. అనుమతి లేకుండా అక్రమంగా లోపలికి ఎవరు
ప్రవేశించాలని భావించినా వారిని మట్టుపెట్టేలా యాంటీ పెనిట్రేషన్, థర్మల్
సెన్సార్లతో పాటు డ్రోన్ల పర్యవేక్షణతో పహారా ఏర్పాటు చేశారు.
ఎయిర్‌స్టేషన్‌కు దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్
వ్యాపింపజేసి శత్రువుల చొరబాట్లను సులువుగా పసిగట్టవచ్చు.