జీపీఎస్ కోసం రెండు సంవత్సరాలు కసరత్తు చేసాం
ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ నిర్ణయాలన్నీ కూడా 60 రోజుల్లోగా అమల్లోకి
రావాలి
అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం
తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో
ఉద్యోగ సంఘాలు భేటీ
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఉద్యోగ సంఘాలు భేటీ
అయ్యాయి. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పలు విభాగాలకు చెందిన ఉద్యోగ
సంఘాలు సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కేబినెట్
నిర్ణయాలు, జీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా సీఎం
మాట్లాడుతూ ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే డెలివరీ మెకానిజం బాగుంటుందని, ప్రజలు
సంతోషంగా ఉంటారని పేర్కొన్నారు. ఉద్యోగుల్ని సంతోషంగా ఉంచడానికి ప్రతి
కార్యక్రమం మనసా, వాచా కర్మేణా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
రాజకీయ కారణాలతో ఎవరైనా ఏదైనా చెప్పినా వాటిని విశ్వసించనవసరం లేదని
సూచించారు. ఉద్యోగులు బాగుండాలని చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామన్నారు.
ఉద్యోగుల సమస్యలను వదిలేయకుండా, ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం చూపించాలని
ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఉద్యోగులకూ మంచి జరగాలి, రాష్ట్ర ప్రభుత్వానికీ
మంచి జరగాలని ఆలోచన చేశామన్నారు. జీపీఎస్ కోసం రెండు సంవత్సరాలు కసరత్తు
చేశామని సీఎం జగన్ వివరించారు. ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణలోకి తీసుకుని
డీఆర్లు జీపీఎస్‌లో ఇస్తున్నామని పేర్కొన్నారు. జీపీఎస్ అన్నది దేశానికే
రోల్ మోడల్ అవుతుందన్నారు. రిటైర్ అయిన ఉద్యోగుల జీవన ప్రమాణాలను
కాపాడినట్టు అవుతుందన్నారు. ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ నిర్ణయాలన్నీ కూడా
60 రోజుల్లోగా అమల్లోకి రావాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఎక్కడా
జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, డైలీ వేజెస్ కేటగిరీ
ఉద్యోగులను కూడా ఆప్కాస్ పరిధిలోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.