వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది
వెలగపూడి : ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేందుకు అవసరమైన
కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
గోపాలకృష్ణ ద్వివేది అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయ అధికారులతో
నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ జూలై 15, జూలై 31, ఆగస్ట్
15 నాటికి సరైన వర్షాలు పడకపోతే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సిద్ధం
చేసుకోవాలన్నారు. పంటలు, పంట రకాల మార్పుపై దృష్టి సారించాలన్నారు.
ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు వేర్వేరుగా పంటల కాలంలో
అవసరమయ్యే వివిధ పంటల సరళి, అవసరమైన ఉత్పాదకలపై దృష్టి సారించాలన్నారు.
వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ పంటల
ప్రణాళికకు అనుగుణంగా జూలై 15 నాటికి వర్షాలు పడకపోతే.. 40 వేల క్వింటాళ్లు,
జూలై 31 నాటికి వర్షాలు పడకపోతే 71 వేల క్వింటాళ్లు, ఆగష్టు 15 నాటికి
వర్షాలు పడకపోతే లక్ష క్వింటాళ్ల విత్తనాలను 80 శాతం రాయితీపై పంపిణీ చేసేలా
చర్యలు చేపడతామన్నారు.
ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ
పంటలకు అవసరమైన విత్తనాల పంపిణీకి కార్పొరేషన్ సిద్ధంగా ఉందన్నారు. అవసరమైతే
నేషనల్ సీడ్స్, తెలంగాణ సీడ్స్, కర్ణాటక సీడ్స్ కార్పొరేషన్ల నుంచి
విత్తనాలు సమీకరించి ఆర్బీకేల ద్వారా రైతులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు
చేస్తామన్నారు.