మోడీ చరిత్రాత్మక పర్యటన కోసం ఉత్సుకతతోఎదురు చూస్తున్నాం
శ్వేతసౌధం అధికారి వెల్లడి
వాషింగ్టన్ : అంతర్జాతీయ రాజకీయ యవనికపై 21వ శతాబ్దంలో భారత్‌ను మించిన
భాగస్వామి లేనేలేదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ విశ్వసిస్తున్నారని శ్వేతసౌధం
పేర్కొంది. ‘భారత్-అమెరికా బంధాన్ని మించిన ద్వైపాక్షిక సంబంధం భూగోళంలోనే ఏ
దేశంతోనూ అమెరికాకు లేదనేది అధ్యక్షుడు బైడెన్ నమ్మకం. ప్రస్తుత సవాళ్ల
కాలంలో అత్యుత్తమ బంధాన్ని నిర్మించుకోవడానికి భారత్‌ను మించిన భాగస్వామి
లేదని ఆయన విశ్వసిస్తున్నారని వెల్లడించింది. అమెరికాలో ఈ నెల 21 నుంచి 24
వరకూ భారత ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక పర్యటన జరపనున్న నేపథ్యంలో
శ్వేతసౌధం అధికారి ఒకరు మాట్లాడారు. ‘ఇటీవల జరిగిన క్వాడ్ సదస్సులో మోడీ ,
బైడెన్లు ప్రపంచ అంశాలపై పలుమార్లు చర్చించారు. వాషింగ్టన్లోనూ అనేక అంశాలపై
వారిద్దరూ మాట్లాడుకోనున్నారు. టెక్నాలజీ, వాతావరణ మార్పులు, రక్షణ రంగాల్లో
పరస్పర సహకారం ప్రధానంగా చర్చకు వచ్చే అంశాలని వివరించారు. మోడీ చరిత్రాత్మక
పర్యటన కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తున్నామని అధ్యక్షుడు బైడెన్ ఉప సలహాదారు
కర్ట్ క్యాంప్‌బెల్ పేర్కొన్నారు. అనేక మంది ఈ కార్యక్రమం కోసం వాషింగ్టన్
వస్తున్నారని వెల్లడించారు. భారత్-అమెరికాలది నమ్మకంతో కూడిన లోపంలేని బంధమని
విదేశాంగ మంత్రి బ్లింకెన్ తెలిపారు. ‘భారత్, అమెరికాలు పెద్ద, సంక్లిష్ట
దేశాలు. మరింత పారదర్శకతతో మార్కెట్ల విస్తరణకు పని చేయాల్సి ఉంది. రెండు
ప్రజాస్వామ్యాలను మరింత బలోపేతంగా తయారు చేయాలి. అప్పుడే ప్రజల పూర్తి శక్తి
సామర్థ్యాలను ఉపయోగించుకోగలం’ అని ఆయన వివరించారు. అమెరికా, భారత్ వార్షిక
వ్యాపార మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది రెండు దేశాల మధ్య వ్యాపార
పరిమాణం 191 బిలియన్ డాలర్లకు చేరుకుందని చెప్పారు. భారత్ ఇచ్చిన 200
బోయింగ్ విమానాల ఆర్డర్‌తో అమెరికాలోని 44 రాష్ట్రాల్లో 10లక్షల ఉద్యోగాల
కల్పన జరగనుందని తెలిపారు.
అంగరంగ వైభవంగా విందు : అమెరికా అధికారికంగా ఆతిథ్యమిస్తున్న మూడో భారత
ప్రధానిగా 72 ఏళ్ల మోడీ నిలవనున్నారు. బైడెన్ అధికారికంగా ఆతిథ్యమిస్తున్న
మూడో దేశాధినేతగానూ మోడీకి గౌరవం దక్కనుంది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి
ప్రధాన కార్యాలయంలో ఈ నెల 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొన్న అనంతరం
ఆయన వాషింగ్టన్‌లోని శ్వేత సౌధానికి చేరుకుంటారు. ఆయనకు అధికారికంగా బైడెన్
దంపతులు స్వాగతం పలికి ఆతిథ్యమిస్తారు. సాయంత్రం డిన్నర్ ఇవ్వనున్నారు. 22వ
తేదీన అమెరికా ప్రభుత్వం తరఫున అధికారిక విందు ఇస్తారు. విందు సందర్భంగా
ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 23వ తేదీన ప్రధాని మోడీకి
ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, విదేశాంగ మంత్రి బ్లింకెన్ విందు ఇస్తారు.
2014లో అధికారంలోకి వచ్చాక అరడజను కంటే ఎక్కువసార్లు మోడీ అమెరికాను
సందర్శించారు. అధ్యక్షులుగా పని చేసిన ఒబామా, ట్రంప్, బైడెన్‌లతో పలు
ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. కానీ అమెరికా అధికారికంగా ఆయనను
ఆహ్వానించడం ఇదే తొలిసారి. 2021లో బైడెన్ పిలుపు మేరకు అమెరికా వెళ్లిన మోడీ
ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. వాషింగ్టన్లో మోడీకి ఘనస్వాగతం పలికేందుకు
వేల మంది ప్రవాస భారతీయులు తరలిరానున్నారు. దీంతో 21, 22 తేదీల్లో అక్కడి
హోటళ్లన్నీ నిండిపోనున్నాయి. ఇప్పటికే గదులు, వాషింగ్టన్కు వచ్చే విమాన
టికెట్ల రేట్లు పెరిగాయి.