కీవ్‌పై దాడులను తిప్పికొట్టిన రక్షణ వ్యవస్థ
కీవ్ : ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సొంత నగరం క్రెవీరీపై రష్యా
క్షిపణులతో విరుచుకుపడింది. క్రూజ్ మిస్సైళ్లతో జరిపిన ఈ దాడుల్లో ఓ
ఐదంతస్తుల అపార్ట్మెంట్ భవనం అగ్నికీలల్లో చిక్కుకోగా పలు ఇళ్లు పూర్తిగా
దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో కనీసం 11 మంది మృతి చెందారని ఆ నగర మేయర్
ఒలెక్సాండర్ విల్కుల్ మంగళవారం వెల్లడించారు. శిథిలాల కింద ఓ వ్యక్తి
చిక్కుకుపోయి ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. మరో 28 మంది గాయపడ్డారని
తెలిపారు. ఈ ఘటనలకు సంబంధించిన చిత్రాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
తన టెలిగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు. ‘‘మరిన్ని ఉగ్ర క్షిపణులు’’ అని
వ్యాఖ్యను వాటికి జత చేశారు. మరోవైపు కీవ్‌పై కూడా రష్యా దాడులను
కొనసాగించింది. కానీ, ఆ నగరానికి రక్షణగా ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు 14
క్షిపణుల్లో పదింటిని కూల్చివేశాయని కీవ్ ప్రాంత మిలిటరీ రీజియన్
ప్రతినిధులు వెల్లడించారు. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాల్లో
మొత్తం గగనతల రక్షణ వ్యవస్థ సైరన్ మోగుతూనే ఉంది. మరోవైపు ఖర్కీవ్, దాని
చుట్టు పక్కల ప్రాంతాలపై ఇరాన్ తయారీ షహీద్ డ్రోన్లతో దాడులు జరిగినట్లు
అక్కడి మేయర్ వెల్లడించారు. ప్రధానంగా పౌర నివాసాలపై రష్యా డ్రోన్లు దాడులు
చేసినట్లు తెలిపారు. కైవ్స్కీ జిల్లాలో ఓ కంపెనీ, సాల్టివిస్కీ జిల్లాలో ఓ
గిడ్డంగి దెబ్బతిన్నట్లు చెప్పారు.
ప్రజలను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులు : క్రెవీరీపై రష్యా దాడులు చేయడాన్ని
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. ‘‘రష్యా హంతకులు.. సామాన్య
ప్రజలు, వారు నివసించే భవనాలు, పట్టణాలపై యుద్ధం ప్రకటించారు’’ అన్నారు. రష్యా
దాడిలో మృతి చెందిన వారికి సంతాపం.. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి
తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన క్షిపణులను ప్రయోగించిన
వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
మరింత ఉక్రెయిన్ భూభాగంపై రష్యా కన్ను: బఫర్‌జోన్ విస్తృతి కోసం
ఉక్రెయిన్‌కు చెందిన మరింత భూభాగాన్ని హస్తగతం చేసుకోవాలంటూ తమ దళాలకు
ఆదేశాలిచ్చేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సిద్ధమయ్యారు. ఈ మేరకు
మంగళవారం మిలిటరీ జర్నలిస్టులు, బ్లాగర్స్‌తో నిర్వహించిన భేటీలో పుతిన్
సూచనప్రాయంగా తెలిపారు. ఉక్రెయిన్ చేపడుతున్న నూతన ప్రతిఘటన చర్యలతో ఆ దేశ
దళాలు తీవ్రంగా నష్టపోతున్నాయని చెప్పారు. ఈ క్రమంలో ఆ దేశం 160 యుద్ధ
ట్యాంకులు, 360 సాయుధ వాహనాలను కోల్పోయిందన్నారు. అదే సమయంలో రష్యా కేవలం 54
ట్యాంకులను నష్టపోయిందని పుతిన్ వివరించారు. అయితే ఈ వివరాలు నిర్ధారణ కాలేదు.
మాపై దాడి జరిగితే రష్యా అణ్వాయుధాలను ప్రయోగిస్తాం : బెలారస్
మాస్కో : తమ దేశంపై ఏదైనా దాడి జరిగితే తమ భూభాగంపై మోహరించనున్న రష్యా
వ్యూహాత్మక అణ్వాయుధాలను ప్రయోగించేందుకు తామేమాత్రం వెనుకాడబోమని బెలారస్
అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో మంగళవారం స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు
సైనిక సాయాన్ని అందిస్తున్న పశ్చిమదేశాలను హెచ్చరించేందుకు తమ మిత్రదేశమైన
బెలారస్లో స్వల్పశ్రేణి అణ్వాయుధాలను మోహరిస్తామని రష్యా అధ్యక్షుడు
వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ
ఆయుధాలపై పూర్తి నియంత్రణ తమ చేతుల్లోనే ఉంటుందని అప్పట్లో ఆయన స్పష్టం
చేశారు. తాజాగా లుకాషెంకో చేసిన ప్రకటన పుతిన్ చెప్పిన దానికి విరుద్ధంగా
ఉండటం గమనార్హం.
ఉక్రెయిన్‌కు కొత్తగా 325 మిలియన్ డాలర్ల ప్యాకేజీ
వాషింగ్టన్ : ఉక్రెయిన్‌కు కొత్తగా 325 మిలియన్ డాలర్ల సైనిక సాయం
అందించాలని అమెరికా నిర్ణయించింది. ఇందులో భాగంగా విస్తృత శ్రేణి రాకెట్లు,
క్షిపణులు, ఇతర ఆయుధాలను ఆ దేశానికి అందించనుంది.