రూ.2,500 కోట్ల కేటాయింపు
మొత్తం రూ.8వేల కోట్లతోవిపత్తు నిర్వహణ పథకాలు
న్యూఢిల్లీ : తుపానుల నష్టాలు, వరదలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం
ప్రత్యేక చర్యలు చేపట్టింది. మొత్తం రూ.8వేల కోట్లతో విపత్తు నిర్వహణ పథకాలను
ప్రకటించింది. అగ్నిమాపక సేవల విస్తరణ, ఆధునికీకరణకు రూ.5,000 కోట్లు, ఏడు
మెట్రో నగరాలైన ముంబయి, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్,
పుణెల్లో వరదల నివారణకు రూ.2,500 కోట్లు, 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత
ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలను తగ్గించడానికి రూ.825 కోట్లతో
ప్రత్యేక చర్యలను చేపట్టనున్నట్లు అమిత్ షా తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞాన్
భవన్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విపత్తు నిర్వహణ విభాగాల
అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్త పథకాలను ప్రకటించారు.
ప్రకృతి విపత్తులవల్ల దేశంలో ఒక్కరూ మరణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని
పిలుపు ఇచ్చారు. ప్రస్తుతం 7 అణు విద్యుత్కేంద్రాలు నిర్మాణంలో ఉన్న
రాష్ట్రాలను ఇటీవల జాతీయ ప్రకృతి విపత్తుల నివారణ ప్రాధికార సంస్థ (ఎన్డీఎంఏ)
నిపుణులు సందర్శించి, ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను
తెలియజేశారని చెప్పారు. ప్రకృతి విపత్తుల నివారణ భారతదేశానికి కొత్త కాదని,
పురాణాల నుంచి చాణక్యుని అర్థశాస్త్రం వరకూ సూచనలు ఉన్నాయని తెలిపారు. ప్రకృతి
వైపరీత్యాలవల్ల పంట నష్టాలకు గురయ్యే రైతులకు నష్ట పరిహారం పెంచాలని కొన్ని
రాష్ట్రాల మంత్రులు కోరగా.. పరిశీలిస్తున్నామని అమిత్ షా హామీ ఇచ్చారు. తరచూ
ప్రకృతి వైపరీత్యాలకు గురయ్యే 350 జిల్లాల్లో ప్రజలకు సాయపడటానికి లక్ష మంది
ఆపద మిత్ర వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు.