భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి
32 ఎకరాల స్థలంలో 3 బ్లాకులతో టవర్లు
హైదరాబాద్ : నిమ్స్ లో విస్తరణకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం
చుట్టారు. కొత్త బ్లాక్ నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. దశాబ్ది
బ్లాక్ పేరుతో ఎర్రమంజిల్ లో తలపెట్టిన ఈ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.
ప్రస్తుతం నిమ్స్ భవనానికి ఆనుకొని ఉన్న 32 ఎకరాల స్థలంలో 1571 కోట్ల రూపాయల
వ్యయంతో కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. 2 వేల పడకల సామర్థ్యంతో నిర్మించే ఈ
కొత్త భవనంలో ఔట్ పేషెంట్, ఎమర్జెన్సీ వైద్యం కోసం ప్రత్యేక బ్లాకులు
ఏర్పాటు చేయనున్నారు. 32 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, 6 మేజర్ మాడ్యులర్
థియేటర్లతో మొత్తం మూడు బ్లాకులలో నిమ్స్ టవర్ నిర్మించనున్నారు. ఈ సందర్భంగా
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వైద్యానికి, మానవ జీవితానికి ఎడతెగని సంబంధం ఉందని
చెప్పారు. మన జీవితంలో వైద్యానికి ఎంతో ప్రాధాన్యం ఉందని గుర్తుచేశారు. ఇలాంటి
కీలక రంగంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని చెప్పారు. రాబోయే
రోజుల్లో మహమ్మారులను ఎదుర్కోవాలంటే ఆరోగ్య శాఖ పటిష్ఠంగా ఉండాలని చెప్పారు.
2014 బడ్జెట్ లో వైద్యరంగానికి రూ.2,100 కోట్లు కేటాయించామని, అది కాస్తా
2023- 2024 నాటికి 12,367 కోట్లకు చేరిందని సీఎం వివరించారు. ఈ దశాబ్ది భవనాల
నిర్మాణంతో నిమ్స్‌లో మరో 2 వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో దేశంలో
అత్యధిక సూపర్ స్పెషాలిటీ పడకలు ఉన్న ఆసుపత్రిగా నిమ్స్ నిలవనుంది. ఈ
కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల
ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.