వారు మాత్రం ఇక్కడ సరిపడా సంపాదించుకున్నాక మూట ముల్లె సర్దుకుని పరాయి
దేశాలకు పరుగులు తీస్తున్నారు. ఇది కొంత ఆందోళనకరమైన విషయమే అయినప్పటికీ ఈ
సంఖ్య గత ఏడాది కంటే ఈ ఏడాది తగ్గడం కొంత ఊరటనిచ్చే అంశం. కుబేరుల వలసల్లో
చైనా ఈ ఏడాది 13,500 వలసలతో అగ్రస్థానంలో ఉండగా భారత దేశం 6,500 మంది కుబేరుల
వలసలతో రెండో స్థానంలో కొనసాగుతోంది.
తగ్గారండోయ్ : హెన్లీ వెల్త్ మైగ్రేషన్ నివేదిక ప్రకారం 6,500 మంది అధిక నికర
విలువ ఉన్న సంపన్నులు ఈ ఏడాది దేశం విడిచి వెళ్తున్నట్లు తెలిపింది. గత
ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కుబేరుల వలసలు గణనీయంగా తగ్గాయని, గత ఏడాది 7,500
మంది కుబేరులు దేశాన్ని విడిచి వెళ్లగా ఈ ఏడాది మాత్రం ఆ సంఖ్యలో వెయ్యి మంది
తగ్గారని తెలిపింది హెన్లీ వెల్త్ మైగ్రేషన్ సంస్థ.
నష్టమే లేదు : న్యూ వరల్డ్ వెల్త్ పరిశోధనాధికారి ఆండ్రూస్ అమాయిల్స్ మాత్రం ఈ
వలసల సంఖ్యలతో పెద్దగా కంగారు పడాల్సిందేమీ లేదని, కొందరు వెళ్లిపోయినా వారికి
రెట్టింపు సంఖ్యలో భారత దేశం కుబేరులను పుట్టిస్తూ ఉందని అన్నారు. క్లిష్టమైన
నిషేధిత పన్ను చట్టాలు, కఠినమైన విదేశీ చెల్లింపుల నిబంధనలే ప్రధానంగా ఈ
వలసలకు కారణాలుగా తెలుస్తోంది. నిజమే మరి. సంపాదన ఉంటే సరిపోతుందా దాన్ని
దాచుకోవాలి కదా.
చైనానే టాప్ : ఇక కుబేరుల వలసల్లో చైనా దేశం అగ్రస్థానంలో కొనసాగుతుండగా భారత
దేశం రెండో స్థానంలో ఉంది. చైనా నుండి ఈ ఏడాది భారీగా 13,500 మంది సంపన్నులు ఆ
దేశాన్ని విడిచి వెళ్తున్నట్లు నివేదిక చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ
కుబేరుల వలసలు గత ఏడాది 1,22,000 గా ఉండగా ఈ ఏడాది మాత్రం ఆ సంఖ్య 1,28,000 కు
చేరుకోనున్నట్లు హెన్లీ అండ్ పార్ట్ నర్స్ సీఈవో డాక్టర్ జుర్గ్ స్టీఫెన్
తెలిపారు.
ఎక్కడికి పోతున్నారు : హెన్లీ వెల్త్ మైగ్రేషన్ నివేదిక ప్రకారం ఈ ఏడాది
అత్యధికంగా 5200 మంది కుబేరులు ఆస్ట్రేలియా చేరుకోనున్నారు. తర్వాత యూఏఈ 4500
మందిని ఆహ్వనించనుంది. ఇక సింగపూర్ 3200 మందిని అమెరికా 2100 మందిని తమ
కుబేరుల జాబితాలో కలుపుకోనున్నాయి. స్విట్జర్లాండ్ , కెనడా, గ్రీస్, ఫ్రాన్స్,
పోర్చుగల్, న్యూజిలాండ్ దేశాలు కుబేరులను ఆహ్వానించడంలో తర్వాతి స్థానాల్లో
ఉన్నాయి.