మయామీ కోర్టులో విచారణకు హాజరు
వాషింగ్టన్ : అధికారిక రహస్య పత్రాలను చట్టవిరుద్ధంగా దాచి ఉంచినట్లు తనపై
దాఖలైన ఫెడరల్ నేరాభియోగాలను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
తోసిపుచ్చారు. తాను ఏ తప్పూ చేయలేదన్నారు. రహస్య పత్రాల కేసులో ఫ్లోరిడా
రాష్ట్రంలోని మయామీ నగరంలో ఫెడరల్ కోర్టుకు మంగళవారం ఆయన హాజరయ్యారు. నేవీ
బ్లూ సూట్, ఎర్రటి టై ధరించి వచ్చిన 77 ఏళ్ల ట్రంప్.. విచారణ ప్రారంభానికి
15 నిమిషాల ముందు కోర్టు హౌజ్‌లో అడుగుపెట్టారు. కుమారుడు ఎరిక్ ట్రంప్,
న్యాయవాదులు ఆయన వెంట వచ్చారు. 49 పే జీల అభియోగపత్రాన్ని చదువుతున్నంతసేపూ
మాజీ అధ్యక్షుడు నిశ్శబ్దంగా నేలను చూస్తూ తన సీటులో కూర్చున్నారు. ట్రంప్ తన
పదవీకాలం ముగిసిన తర్వాత ఉద్దేశపూర్వకంగానే రహస్య పత్రాలను వెంట
తీసుకెళ్లారని, వాటిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులను
అడ్డుకున్నారని అభియోగ పత్రంలో ఫెడరల్ న్యాయవాదులు ఆరోపించారు. మొత్తం 37
ఫెడరల్ కౌంట్ల అభియోగాలను వారు మోపారు. వాటిలో గూఢచర్య చట్టం ఉల్లంఘనకు
సంబంధించినవి 31. మరోవైపు- ట్రంప్ నిర్దోషి అని ఆయన తరఫు న్యాయవాదులు
వాదించారు. విచారణ జరిగినంతసేపు (దాదాపు 45 నిమిషాలు) ట్రంప్ పెద్దగా ఏమీ
మాట్లాడలేదు. తన న్యాయవాదులతో చెవిలో ఏదో చెబుతూ మాత్రమే కనిపించారు.
వారితో మాట్లాడొద్దని షరతు : ట్రంప్‌పై ప్రయాణ ఆంక్షలు విధించాలా వద్దా
అనేదానిపై విచారణ సందర్భంగా చర్చ జరిగింది. ఆయన తన పాస్‌పోర్టును సమర్పించాలా
అని ప్రతివాదులను న్యాయమూర్తి అడిగారు. వారు అవసరం లేదని బదులిచ్చారు. దీంతో
ట్రంప్‌పై ప్రయాణ ఆంక్షలేవీ విధించట్లేదని యూఎస్ మేజిస్ట్రేట్ జడ్జి
జొనాథన్ గుడ్మాన్ తెలిపారు. అయితే ఈ కేసుతో సంబంధమున్న సాక్ష్యులు,
బాధితులతో కేసు గురించి నేరుగా ఏమీ మాట్లాడొద్దని ట్రంప్‌నకు జడ్జి షరతు
విధించారు. న్యాయవాదుల ద్వారానే వారితో మాట్లాడాలని సూచించారు. తదుపరి విచారణ
కోసం ట్రంప్ ఎప్పుడు న్యాయస్థానానికి హాజరవ్వాలన్నదానిపై మంగళవారం చర్చ
జరగలేదు.
విచారణ తర్వాత ఘన స్వాగతం : విచారణ అనంతరం ట్రంప్ నేరుగా న్యూజెర్సీలోని తన
గోల్ఫ్ కోర్టుకు వెళ్లారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. బుధవారం
ట్రంప్ పుట్టినరోజు కావడంతో మద్దతుదారులు గట్టిగా అరుస్తూ శుభాకాంక్షలు
తెలిపారు. ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం ట్రంప్ ప్రసంగిస్తూ
ప్రస్తుత దేశాధ్యక్షుడు జో బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. అమెరికా చరిత్రలో
ఫెడరల్ అభియోగాలు ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షుడు ట్రంపే. ఈ కేసులో
దోషిగా తేలితే కొన్నేళ్లపాటు జైలుశిక్ష పడే అవకాశముంది. అయితే- దోషిగా
తేలినప్పటికీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై నిషేధమేమీ ఉండదు.
ప్రస్తుతం రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని దక్కించుకునేందుకు
ట్రంప్ ముందంజలో ఉన్నారు.