అంకారా : నాటోలో స్వీడన్‌కు సభ్యత్వంపై కొనసాగుతున్న ప్రతిష్టంభన ఇప్పట్లో
తొలిగేలా లేదు. మొదటి నుంచీ స్వీడన్‌ను అడ్డుకుంటున్న తుర్కియే మరోమారు తన
వైఖరికే కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. భద్రతాపరమైన ఆందోళనల విషయంలో
తమకున్న అనుమానాలను ఇంకా స్వీడన్ నివృత్తి చేయలేదని, అవి పరిష్కారమయ్యే వరకూ
నాటో దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని తుర్కియే అధ్యక్షుడు రెసెప్
తయ్యిప్ ఎర్డోగాన్ స్పష్టం చేశారు. అంకారాలో నాటో, స్వీడన్, ఫిన్లాండ్,
తుర్కియే అధికారులు సమావేశమయ్యారు. తీవ్రవాద సంస్థల విషయంలో తుర్కియే
ఆందోళలనలపై వారి మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ఎర్డోగాన్ సందేశాన్ని
తుర్కియే అధికారులు వెల్లడించారు. వచ్చే నెలలో లిథువేనియా రాజధాని
విల్నియస్‌లో జరిగే సమావేశాల్లో తమ నుంచి ఎటువంటి సానుకూల నిర్ణయాన్ని
ఆశించవద్దని అధ్యక్షుడు చెప్పినట్లు తుర్కియే అధికారులు తెలిపారు. రష్యా,
ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక స్వీడన్, ఫిన్లాండ్లు నాటోలో
సభ్యత్వానికి దరఖాస్తు చేశాయి. తుర్కియే పార్లమెంటు అనుమతించడంతో ఈ ఏడాది
ఏప్రిల్‌లో నాటోలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేరింది. స్వీడన్‌కు
అనుమతివ్వలేదు. కుర్దిష్ మిలిటెంట్ల పట్ల స్వీడన్ మెతక వైఖరి
అవలంభిస్తోందనేది తుర్కియే ఆరోపణగా ఉంది. ఇస్లాం వ్యతిరేక ఆందోళనకారులు
స్టాక్‌హోంలో వరుసగా నిరసన ప్రదర్శనలు నిర్వహించడం, తమ రాయబార కార్యాలయం ఎదుట
ఖురాన్‌ను దహనం చేయడం వంటి సంఘటనలపైనా తుర్కియే ఆగ్రహంగా ఉంది.