భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో నిర్వహించబోయే పర్యటనలో కీలకమైన సాయుధ
డ్రోన్ల ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ ఆఫర్‌ను అమెరికా తీసుకువచ్చినట్లు ఈ
వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక అధికారులు పేర్కొన్నారు. దాదాపు డజను సాయుధ
డ్రోన్లు విక్రయించేలా ఒప్పందం ఉంటుందని వారు వెల్లడించారు. చాలాకాలంగా
అమెరికా నుంచి వీటిని కొనుగోలు చేసేందుకు భారత్ ఆసక్తి చూపుతోంది. కొన్ని
ఇబ్బందులతో ఈ ఒప్పందం ముందుకు వెళ్లడంలేదు. ఈ నెల 22 నుంచి మోదీ చేపట్టనున్న
పర్యటన దీనిని కొలిక్కి తెస్తుందని అంచనా వేస్తున్నారు. డ్రోన్ ఒప్పందం
విషయంలో పురోగతి చూపించాలని అమెరికా విదేశాంగ శాఖ, రక్షణ శాఖ అధికారులు- ఈ
పర్యటన ఖరారు కాగానే భారత్‌ను కోరారు. 30 వరకు ‘ఎంక్యూ-9బి సీ గార్డియన్’
డ్రోన్లను విక్రయించాలని అగ్రరాజ్యం భావిస్తోంది. పలు ఆయుధాల విషయంలోనూ ఈ
పర్యటనలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య చర్చలు
జరగనున్నాయి. మరోవైపు- ఉన్నతస్థాయి సాంకేతికతకు సంబంధించిన ఏడు రంగాల్లో
భాగస్వామ్యం కోసం భారత్, అమెరికాలు ఒక మార్గసూచీని ఆవిష్కరించాయి. జాతీయ
భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, ఇక్కడ పర్యటిస్తున్న అమెరికా జాతీయ భద్రతా
సలహాదారు జేక్ సలీవాన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనికింద సెమీ
కండక్టర్లు, కొత్త తరం టెలికమ్యూనికేషన్, కృత్రిమ మేధ (ఏఐ), రక్షణ రంగాల్లో
రెండు దేశాలు సహకరించుకుంటాయి.