బెంగళూరు: ఇటీవల సదాశివనగరలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేపీసీసీ
అధ్యక్షుడు డీకే శివకుమార్‌ల భేటీ కొత్త బాధ్యతలు, ఎన్నికల ప్రణాళికలకు
వేదికగా మారింది. కర్ణాటకలో కాంగ్రెస్‌కు అపూర్వ విజయం దక్కడంలో కీలక పాత్ర
పోషించిన డీకే శివకుమార్ సేవలు ఆ పార్టీ పూర్వ వైభవాన్ని తిరిగి
తెచ్చుకునేందుకు ఉపయోగించుకోవాలని అధిష్ఠానం యోచిస్తోంది. ఇందులో భాగంగానే
వీరిద్దరి మధ్య చర్చలు సేవల విస్తరణపై దృష్టి సారించాయి. త్వరలో తెలంగాణలో
నిర్వహించే ఎన్నికల బాధ్యతలను డీకే శివకుమార్‌కు అప్పగించాలని అధిష్ఠానం
సూచిస్తోంది. ఈ మేరకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో డీకే
శివకుమార్ త్వరలో భేటీ కానున్నారు. ఆయన భేటీ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్
బృందాన్ని నియమించే బాధ్యత కూడా డీకేకు అప్పగించినట్లు సమాచారం. ఈనెల చివరి
వారంలో ఆయన తెలంగాణకు బయలుదేరనున్నారు.
పాలికెపై దృష్టి : కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన విజయం జాతీయ స్థాయిలో
బీజేపీయేతర శక్తులకు ఊపిరినిచ్చినట్లే. కాంగ్రెస్ నేతృత్వంలో బీజేపీ యేతర
పార్టీలన్నీ నడవాలంటే అంతకంటే ముందుగా వచ్చే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్
గణనీయంగా పుంజుకోవాల్సిందే. లేదంటే కర్ణాటకలో విజయం గాలివాటంగా వచ్చిందన్న
భావన పెరిగే అవకాశం ఉంది. ఇందు కోసం పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్‌కు
సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ మాటగా మల్లికార్జున ఖర్గే ప్రత్యేక సూచనలు చేశారు.
తెలంగాణతో పాటు బీబీఎంపీ, స్థానిక ఎన్నికల్లోనూ విజయం సాధిస్తే పార్టీ
ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. ఇందు కోసం నగర ఇన్‌ఛార్జి మంత్రిగా డీకే
శివకుమార్‌పై మరింత బాధ్యత మోపారు. మంగళవారం ఈ విషయంపై పార్టీ ప్రధాన
కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా ప్రత్యేకంగా చర్చించారు. విధానసభ
ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం, ఇతర
కార్యాచరణపై అధిష్ఠానం ప్రత్యేక ప్రణాళిక రచించనుంది. ముఖ్యమంత్రిగా
సిద్ధరామయ్యకు బరువైన బాధ్యత ఉండగా, ఎన్నికల బాధ్యతను డీకేకు అప్పగించడం
శ్రేయస్కరమన్న యోచనలో అధిష్ఠానం ఉంది.
నాకు ఆ క్రెడిట్ దక్కలేదే? : హోంశాఖ మంత్రి డా.జి.పరమేశ్వర్
నా అధ్యక్షతన 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించి అధికారాన్ని
చేపట్టింది. నాకు ఆ క్రెడిట్ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా నా పేరు కనీసం
పరిశీలించలేదని హోంశాఖ మంత్రి డా.జి.పరమేశ్వర్ వ్యాఖ్యానించారు. తాజా ఎన్నికల
తర్వాత ఆ పరిస్థితి లేదు. ఈ విజయానికి ఎందరెందరినో బాధ్యులుగా చేస్తూ
ముఖ్యమంత్రి పదవికి అర్హుడిగా ప్రకటిస్తున్నారని పరోక్షంగా డీకే శివకుమార్
పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. దళితులపై నిబద్ధత ఉండటం వేరు, దానిని
ఆచరణలో ఉంచటం వేరని ముఖ్యమంత్రిపైనా పరోక్ష విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో
కాంగ్రెస్ సాధించిన విజయానికి సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల నాయకత్వమే
కారణమని పార్టీ ప్రచారం చేయడం, ఈ విజయం స్ఫూర్తితో డీకే శివకుమార్‌కు అదనపు
బాధ్యతలు అప్పగించేందుకు అధిష్ఠానం చేస్తున్న ప్రయత్నాలు పార్టీలో
భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యేలా చేయడం గమనార్హం.