వాషింగ్టన్ : గ్రీన్‌కార్డు కోసం నిరీక్షిస్తున్నవారు అమెరికాలోనే ఉంటూ పని
చేసుకునేందుకు అవసరమైన అర్హత ప్రమాణాలను బైడెన్ సర్కారు తాజాగా కాస్త
సడలించింది. విధానపరమైన కొత్త మార్గసూచీని రూపొందించింది. ప్రధాని మోదీ ఈ నెల
21 నుంచి అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం
గమనార్హం. తాజా మార్గసూచీని అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం
విడుదల చేసింది. ఆ దేశంలో కొనసాగేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో
‘ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ)’ ప్రాథమిక/పునరుద్ధరణ
దరఖాస్తులను సమర్పించేవారికి ఉండాల్సిన అర్హత ప్రమాణాలను అందులో
పొందుపరిచింది. ఆమోదం పొందిన ఫామ్ ఐ-140లో ప్రధాన లబ్ధిదారుగా ఉండటం,
చెల్లుబాటయ్యే నాన్-ఇమ్మిగ్రంట్ హోదా కలిగి ఉండటం, నిర్దిష్ట
బయోమెట్రిక్ల్లో ప్రమాణాలను అందుకోవడం, నేరచరిత్ర లేకపోవడం వంటివి వాటిలో
ఉన్నాయి. అమెరికాలోనే ఉంటూ ఉద్యోగం చేసుకునేందుకు కావాల్సిన తప్పనిసరి
పరిస్థితులు ఆయా వ్యక్తులకు ఉన్నాయో లేదో యూఎస్సీఐఎస్ తన విచక్షణను
ఉపయోగించి నిర్ధారిస్తుంది. గ్రీన్‌కార్డు కోసం నిరీక్షిస్తున్నవారు లేదా
వారిపై ఆధారపడి ఉన్న కుటుంబసభ్యులు తీవ్ర అనారోగ్యం, వైకల్యం, యాజమాన్యంతో
గొడవ, ఉద్యోగం కోల్పోవడం వంటి ఇబ్బందుల్లో ఉంటే తాజా మార్గసూచీలో ఇచ్చిన
సడలింపులు వారికి ప్రయోజనకరంగా ఉంటాయి.