న్యూఢిల్లీ : దేశంలో ఉన్నత చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించే శాసనసభ్యులు
దేశంలోని ఇతర సంస్థలు, వ్యవస్థలకు ఆదర్శంగా ఉండేలా పనిచేయాలని లోక్సభ
స్పీకర్ ఓం బిర్లా పిలుపునిచ్చారు. ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్
సెంటర్లో జరిగిన శాసనసభ్యుల తొలి జాతీయ సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
‘‘చట్టసభలు ప్రజల సామాజిక, ఆర్థిక సంక్షేమానికి కృషిచేయాలి. వాటి పనితీరు
గౌరవప్రదంగా ఉండాలి. ఇటీవల చట్టసభల్లో గందరగోళం, అంతరాయాలు పెరిగిపోవడం ఆందోళన
కలిగిస్తోంది. సభలో గొడవలు, నినాదాలు, సభను పదేపదే వాయిదా వేయడం అనేవి
ప్రజాస్వామ్యానికి మంచి సంకేతాలు కావు. అవి మన ప్రజాస్వామ్య మర్యాదనే
తగ్గిస్తాయి. ప్రజాజీవితంలో శాసనసభ్యులు క్రమశిక్షణ, హుందాతనాన్ని
ప్రదర్శించాలి. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే వారి ప్రతిష్ఠే దెబ్బతింటుంది.
కార్యనిర్వాహక వ్యవస్థ శాసనవ్యవస్థకు జవాబుదారీగా ఉండేలా పనిచేయాలి. ప్రజలు,
కార్యనిర్వాహక వ్యవస్థ మధ్య ముఖ్యమైన అనుసంధాన కర్తలు ప్రజాప్రతినిధులే.
అందువల్ల ప్రజా ప్రయోజనాలు, ఆకాంక్షలు, కోరికలను కార్యనిర్వాహక వ్యవస్థ
దృష్టికి తీసుకెళ్లి అవి అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులదే.
చట్టసభల్లో చర్చలు, సంవాదాలు ప్రజాసమస్యలను తీర్చేలా ఉండాలి. అందువల్ల సభ్యులు
ఆత్మావలోకనం చేసుకొని భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారం కనుక్కోవాలి.
ప్రజాప్రతినిధులు తాము ప్రాతినిధ్యం వహించే ప్రజలకు జవాబుదారీగా ఉండడంతోపాటు,
చేతల్లో పారదర్శకతను చూపాలి’’ అని ఓం బిర్లా పేర్కొన్నారు.