వచ్చే ఏడాదే తరగతులు ప్రారంభం కావాలి
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశం
హైదరాబాద్ : తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే మరో 8 ప్రభుత్వ వైద్య
కళాశాలలను కొత్తగా ప్రారంభించడానికి ప్రతిపాదనలను రూపొందించాలని రాష్ట్ర
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో
వచ్చే ఏడాదికి అన్ని జిల్లాల్లో ఒక్కో ప్రభుత్వ వైద్య కళాశాల ఉండాలన్నది సీఎం
కేసీఆర్ లక్ష్యమని గుర్తుచేశారు. సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై నిర్వహించిన
సమీక్షలో మంత్రి మాట్లాడుతూ ‘‘ప్రజలకు జిల్లా స్థాయిలోనే స్పెషాలిటీ వైద్య
సేవలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతోనే ప్రతి జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాలను
స్థాపిస్తున్నాం. ఇప్పటికే 33 జిల్లాలకు 25 చోట్ల ఏర్పాటు చేశాం. మిగిలిన
ఎనిమిది జిల్లాల్లోనూ ప్రారంభించేందుకు అవసరమైన భూకేటాయింపులు, ఇతర పనులను
వేగవంతం చేయాలి. జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఇబ్బంది
కలగకుండా జాతీయ వైద్యమండలి మార్గదర్శకాల ప్రకారం మెడికల్ కాలేజీల ఏర్పాటు
ప్రక్రియను పూర్తిచేయాలి. ఇప్పటికే ప్రారంభించిన వైద్య కళాశాలలు ఎన్ఎంసీ
నిబంధనల ప్రకారం నడుచుకునేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత సూపరింటెండెంట్లపైనే
ఉంది. రాష్ట్రంలో పెద్ద మొత్తంలో మౌలిక వసతుల కల్పనతోపాటు వైద్య సిబ్బందిని
నియమిస్తూ ఆరోగ్యరంగాన్ని పటిష్ఠం చేశాం. ఈ చర్యలతో మంచి ఫలితాలు వస్తున్నాయి.
వైద్యరంగంలోని వివిధ విభాగాల్లో తెలంగాణ చాలా ముందుందనికేంద్ర గణాంకాలు
చెబుతున్నాయి. అన్నింట్లో కలిపి రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవాలన్నది సీఎం
సంకల్పం. ఈమేరకు ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యసేవలను అందించేందుకు వైద్యులు,
సిబ్బంది కృషి చేయాలి’’ అని వివరించారు.
100వ రోజుకు ‘కంటివెలుగు’ : కంటి వెలుగుపై మంత్రి హరీశ్‌రావు సమీక్షిస్తూ
ప్రజలు చూపు సమస్యలతో బాధ పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం
శనివారానికి 100వ రోజుకు చేరుతోందని సంతోషం వ్యక్తంచేశారు. ‘‘ఇప్పటివరకు 99
పని దినాల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.61 కోట్ల మందికి కంటి పరీక్షలు చేశాం.
వీరిలో 22.51 లక్షల మందికి రీడింగ్, 18.08 లక్షల మందికి కంటి చూపునకు
సంబంధించిన అద్దాలు అందచేశాం. ఇప్పటికే 24 జిల్లాల్లో కంటి వెలుగు పూర్తయింది.
స్క్రీనింగ్ పూర్తయిన వెంటనే రీడింగ్ గ్లాసెస్, నాలుగు వారాల్లోగా
ప్రిస్క్రిప్షన్ అద్దాలను ఇస్తున్నాం’’ అని మంత్రికి అధికారులు వివరించారు.
సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ
కమిషనర్ శ్వేతా మహంతి, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో విశాలాచ్చి, డీఎంఈ
రమేష్‌రెడ్డి, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు, టీవీవీపీ కమిషనర్
అజయ్‌కుమార్, టీఎస్ ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు
పాల్గొన్నారు.