విజయవాడ : జగన్ ప్రభుత్వంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు
తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని తొమ్మిది సంవత్సరాల
సేవా సుపరిపాలన పేదల సంక్షేమ కార్యక్రమాలపై బీజేపీ నాయకులు సభలు
నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం విజయవాడలో జీవీఎల్ మాట్లాడుతూ
రాష్ట్రంలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని, అమిత్ షా దగ్గర
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌పై పూర్తి నివేదిక ఉందన్నారు. విశాఖలో ఎంపీ కుటుంబం
కిడ్నాప్ ఘటనలో నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు. విశాఖలో భూ మాఫియా
జరుగుతోందని, ఈ భూ దందాపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఎందుకు
బయటపెట్టలేదని జీవీఎల్ ప్రశ్నించారు. ఆ రిపోర్ట్ ఆధారంగా సీఎం జగన్ భూ
సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు. ‘పేర్ని నానినీ అడుగుతున్న.. నాకు
స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇవ్వాలి’ అని జీవీఎల్ అన్నారు. బాపట్ల
జిల్లాలో చిన్న బాలుడిని పెట్రోల్ పోసి తగలపెట్టడం అమానుషమన్నారు. వైసీపీ
కార్యకర్తలలో రాక్షస మనస్తత్వం నింపారని, వైసీపీ అంటే రాక్షస సంతతి అని
ప్రకటించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి ఆ మృతుని కుటుంభానికి క్షమాపణ
చెప్పాలన్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగనవని చెప్పి..సీఎం రాజీనామా చెయ్యాలని
డిమాండ్ చేశారు. ఏపీలో ఇసుక, మైనింగ్‌పై సీబీఐ విచారణ జరగాలని, రాష్ట్రంలో
రాజకీయ కక్ష సాధింపులు జరుగుతున్నాయని జీవీఎల్ నరసింహరావు తీవ్రస్థాయిలో
దుయ్యబట్టారు.