సరిహద్దుల మూసివేతతో ఆగిన లావాదేవీలు
పాంగ్యాంగ్ : మూడు దశాబ్దాల కిందటి 1990ల నాటి కరవు పరిస్థితుల తర్వాత మళ్లీ
ఇపుడు ఉత్తర కొరియా తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచాన్ని
కుదిపేసిన కొవిడ్ -19 మహమ్మారి కారణంగా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 2020లో
సరిహద్దులు మూసివేయడంతో ఆహార సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
కిమ్ నిరంకుశ పాలనలో కొవిడ్ ప్రేరిత ఐసొలేషన్ చర్యలు కొనసాగుతున్నాయి.
‘‘ఆహారం దొరక్క మా పొరుగువాళ్లు కళ్ల ముందే చనిపోతున్నారు’’ అని స్థానిక
పౌరులు కొందరు బీబీసీ వార్తాసంస్థకు రహస్యంగా తమ ఆవేదన వ్యక్తం చేశారు.
సరిహద్దులు మూసివేయడంతో చైనా నుంచి ధాన్యం దిగుమతితోపాటు పంటలు పండించేందుకు
అవసరమైన ఎరువులు, యంత్రాల సరఫరా కూడా నిలిచిపోయింది. సరిహద్దులు దాటేందుకు
ఎవరైనా ప్రయత్నిస్తే కాల్చివేయాలని గార్డులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. 2.6 కోట్ల
జనాభా ఉన్న ఉత్తర కొరియా దేశ అవసరాలకు సరిపడా ధాన్యం ఉత్పత్తిలో చాలాకాలంగా
వెనుకబడి ఉంది. అణ్వాయుధ కార్యక్రమాల కోసం దేశ ధనాగారం మొత్తం మళ్లిస్తున్న
కిమ్ ప్రజల ఆకలిచావులపై దృష్టి సారించటం లేదు. ‘‘ఉత్తర కొరియా సరిహద్దులు
తెరిచి పొరుగు దేశాలతో వాణిజ్యం పునరుద్ధరించాలి. వ్యవసాయం అభివృద్ధికి తగిన
సదుపాయాలు కల్పించాలి. కానీ, ఇక్కడి పాలకులు ఒంటరితనం, అణచివేతలకే ఎక్కువ
ప్రాధాన్యం ఇస్తున్నారని మానవహక్కుల సంస్థ సీనియర్ పరిశోధకుడు లినా యూన్
‘సీఎన్ఎన్’కు తెలిపారు.
రాజధాని నగరం పాంగ్యాంగ్లో నివసించే ఓ మహిళ బీబీసీతో మాట్లాడుతూ ‘‘మా
పొరుగున ముగ్గురు వ్యక్తులున్న కుటుంబం దుర్భర పరిస్థితుల్లో ఉండటంతో కనీసం
నీళ్లయినా ఇద్దామని తలుపు తట్టాం. ఎవరూ పలకలేదు. అధికారులు లోనికి వెళ్లి
చూస్తే ముగ్గురూ చనిపోయి ఉన్నారు’’ అని తెలిపింది. చైనా సరిహద్దు గ్రామంలో
నివసిస్తున్న మరో భవననిర్మాణ కార్మికుడు మాట్లాడుతూ ‘‘ఆహార సరఫరా పరిస్థితి
మరీ దారుణంగా ఉంది. మా గ్రామంలో ఇప్పటికే అయిదుగురు వ్యక్తులు ఆకలితో
చనిపోయారు. మొదట్లో కొవిడ్‌తో పోతామని భయపడ్డాం. ఇపుడు ఆకలి పెద్ద సమస్యగా
మారింది’’ అన్నాడు. సాధారణ, మధ్యతరగతి ప్రజలు తమ ఇరుగు పొరుగులో ఆకలిచావులు
చూడటం ఆందోళనకరం. మా సమాజం పూర్తిస్థాయిలో పతనమైంది అని చెప్పడం లేదు కానీ,
ఇది మంచి పరిణామం కాదని ఉత్తర కొరియా ఆర్థికవేత్త పీటర్ వార్డ్
అభిప్రాయపడ్డారు. 1990ల నాటి దుర్భిక్ష పరిస్థితుల్లో ఉత్తర కొరియాలో దాదాపు
30 లక్షల మంది మరణించారు.