బీజింగ్ : రెండు రోజుల పర్యటన కోసం అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ
బ్లింకెన్ చైనా చేరుకొన్నారు. పలు అంశాలపై రెండు దేశాల మధ్య నెలకొన్న
ఉద్రిక్తతలను చల్లార్చడమే లక్ష్యంగా ఆయన దౌత్య చర్చలను సాగిస్తారు. తొలుత ఆయన
చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్‌తో సమావేశమయ్యారు. విదేశాంగ శాఖలో
ఉన్నతాధికారి వాంగ్ యీతో భేటీ అవుతారు. అధ్యక్షుడు జిన్‌పింగ్‌తోనూ
సమావేశమయ్యే అవకాశం ఉంది. అమెరికా విదేశాంగ మంత్రి ఒకరు చైనాలో పర్యటించడం గత
ఐదేళ్లలో ఇదే మొదటిసారి. వాస్తవానికి గతంలోనే ఈ పర్యటన జరగాల్సి ఉండగా చైనా
నిఘా బెలూన్ ఘటనతో నిలిచిపోయింది. సమావేశానికి ముందు బ్లింకెన్ గానీ,
క్విన్ గానీ విలేకరులతో మాట్లాడలేదు. ఈ పర్యటన వల్ల దౌత్య సంబంధాలు
ఇప్పటికిప్పుడు సాధారణ స్థాయికి చేరే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు
చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య వైరం తీవ్రం కావడమే ఇందుకు
కారణమని పేర్కొంటున్నారు. 2021 బైడెన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక
చైనాను సందర్శిస్తున్న అత్యున్నత స్థాయి అమెరికా నేత బ్లింకెన్ కావడం
గమనార్హం. ఆయన బీజింగ్ పయనం కావడానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ చైనాతో
ఉన్న పోటీని వివాదంగా మార్చదల్చుకోలేదని పేర్కొన్నారు. అపార్థాలకు తావు
లేకుండా చూడటానికి ఇరు దేశాల నేతల మధ్య కమ్యూనికేషన్లను మెరుగుపరచుకోవాలని
భావిస్తున్నట్లు తెలిపారు. గత నవంబర్‌లో జిన్‌పింగ్, జో బైడెన్
ఇండోనేసియాలోని బాలీలో భేటీ అయిన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొంత
తగ్గుముఖం పట్టాయి.