నరసన్నపేట : జాతీయ స్థాయి నీట్ పరీక్షలో తొలి ర్యాంక్ సాధించి జిల్లాకు
చరిత్రాత్మకమైన గుర్తింపు తీసుకురావడం ఎంతో గర్వకారణమని మాజీ డిప్యూటీ సీఎం
ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సోమవారం నరసన్నపేట ఎస్.ఎల్.వి.డి కళ్యాణ మండపంలో
జరిగిన ప్రత్యేక అభినందన సదస్సులో ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు.
ఆల్ ఇండియా నీట్ (ఎంబీబీఎస్ లో చేరేందుకు ప్రవేశ పరీక్ష) లో మొదటి ర్యాంకు
సాధించిన పోలాకి వాసి వరుణ్ చక్రవర్తిని అభినందించారు. దేశంలో జిల్లాకు
రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచినందుకు విద్యార్థిని, వారి తల్లిదండ్రులను
సత్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వికాసానికి సీఎం
వైఎస్ జగన్మోహనరెడ్డి నిరవధికంగా కృషిచేసున్నారని అన్నారు. ప్రతిభకు
కేంద్రాలుగా అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలను తీర్చిదిద్దుతున్నారని చెప్పారు.
ఇలాంటి తరుణంలో వరుణ్ చక్రవర్తి లాంటి వారు సాధిస్తున్న విజయాలు ఎంతోమందికి
మరింత ప్రేరణ, స్ఫూర్తిని అందించి వారిని కర్తవ్యం దిశగా నడిపిస్తాయని
అన్నారు. వరుణ్ కృషిని ప్రతి ఒక్క విద్యార్దీ స్ఫూర్తిగా తీసుకోవాలని, ప్రతి
కుటుంబంలో విద్య వికసించాలన్నదే సీఎం జగన్ ధ్యేయమన్నారు. వరుణ్ చక్రవర్తిని
సీఎం జగన్ తో కూడా సన్మానించడానికి తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. పేదరికం
విద్యకు శాపం కాకూడదని, ప్రతి పేద విద్యార్ధికి కూడా ఉన్న విద్యకు తగిన
ప్రొత్సాహం అందిస్తున్న గొప్ప వ్యక్తి సీఎం జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో
ఎంపీపీలు ఆరంగి మురళి, వాన గోపి, సీనియర్ నాయకులు చింతు రామారావు, పంగ బావాజీ
నాయుడు, సర్పంచ్ బురెళ్ళ శంకర్, కోరాడ చంద్ర భూషణ్ గుప్తా, రాజాపు అప్పన్న,
బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు సదాశివుని కృష్ణ, పొట్నూరు సాయి ప్రసాద్
తదితరులు పాల్గొన్నారు.