అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి పోరాటం చేస్తాం
లోప భూయిష్ట విధానాలపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలి
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి
విజయవాడ : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పలు దోపిడీ నిర్ణయాలతో ప్రజల సంపదను
కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో ప్రకృతి వనరులను కూడా దోచేస్తూ కొత్త
విధానాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఇసుక, కంకర, గ్రానైట్, ఇతర ముడి సరుకు
వసూళ్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని ఆరోపించారు. చిత్తూరు, కడప,
విజయనగరం, అనంతపురంలలో దొంగలకు అప్పగించారన్నారు. దొంగ చేతికి తాళం ఎలా
ఇవ్వాలో జగన్ ప్రభుత్వం చేసి చూపించిందని విమర్శించారు. ఈ కాంట్రాక్టు సంస్థలు
బినామీ పేర్లతో టెండర్లు వేసుకుని అమ్మేస్తున్నారన్నారు. ప్రభుత్వానికి
చెల్లించేది పది కోట్లు అయితే కాంట్రాక్టర్లు యాభై కోట్లు వసూళ్లు
చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక విషయంలో రూ.700 కోట్లు
ప్రభుత్వానికి చెల్లించి, రూ.7 వేల కోట్లు కాంట్రాక్టు సంస్థ దోచుకుంది
వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఏపీలో ఇసుక అమ్మకుండా ఇతర రాష్ట్రాలకు దర్జాగా
తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఇది నయా దోపిడీ
అనేది వాస్తవమన్నారు. అసలు ఈ కాంట్రాక్టు కంపెనీ వెనుక ఉన్న పెద్దవాళ్లు ఎవరో
చెప్పే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అంటూ నిలదీశారు. ఈ విషయాలలో అవసరమైతే
న్యాయస్థానాలను ఆశ్రయించి పోరాటం చేస్తామన్నారు. వనరులను కాపాడాల్సిన
ప్రభుత్వమే వనరులను దోపిడీ చేయడం చాలా దుర్మార్గమన్నారు. లోప భూయిష్ట
విధానాలపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్
చేశారు. బీజేపీ తొమ్మిదేళ్ల పాలన సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు
జరుగుతున్నాయని ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి
తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ మంగళవారం అనంతపురంలో కిరణ్ కుమార్
రెడ్డి, రాజమండ్రిలో సోము వీర్రాజు, అరకులో దగ్గుబాటి పురంధరేశ్వరి సభల్లో
పాల్గొంటారన్నారు.