ప్రాధాన్యత ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక శ్రద్ధ
జల వనరుల శాఖ పై ముఖ్యమంత్రి వైయస్.జగన్ మోహన్ రెడ్డి సమీక్ష
అమరావతి : జల వనరుల శాఖ పై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం
సమీక్ష నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమగ్రంగా ముఖ్యమంత్రి
చర్చించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్యాలెండర్ ప్రకారం రైతులకు సాగునీరు
విడుదలచేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే గోదావరి, కృష్ణాడెల్టా,
తోటపల్లి కింద ప్రాంతాలకు సాగునీరు విడుదలచేశామని వెల్లడించారు. పోలవరం
ప్రాజెక్టు నిర్మాణం సమీపిస్తున్న కొద్దీ లెఫ్ట్ మెయిన్ కెనాల్‌పై కూడా
దృష్టిపెట్టాలని, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో పనులు చురుగ్గా
సాగుతున్నాయని, ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్-1లో శాండ్ ఫిల్లింగ్,
వైబ్రోకాంపాక్షన్ పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. గ్యాప్-2
వద్ద కూడా ఇదే పనులు చురుగ్గా సాగుతున్నాయని, కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర
జలమండలి అధికారులు గైడ్ బండ్లో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారని, నేల
స్వభావంలో మార్పలు కారణంగా ఇది జరిగి ఉండొచ్చని అనుమానాన్ని కమిటీ
వెల్లడించిందని, దెబ్బతిన్న ప్రాంతాన్ని రాక్ డంప్‌తో, సిమెంట్ స్లర్రీతో
నింపాలని, గేబియన్స్‌తో సపోర్టు ఇవ్వాలని కమిటీ సూచించిందని, ఆమేరకు పనులు
ముందుకు తీసుకెళ్తున్నామని అధికారులు తెలిపారు. పూర్తి విశ్లేషణ తర్వాత
శాశ్వతంగా చేయాల్సిన మరమ్మతులను సూచిస్తామని కమిటీ చెప్పినట్టుగా అధికారులు
పేర్కొన్నారు. పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి కేంద్ర ఆర్థికశాఖ రూ.12,911.15
కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని, కేంద్ర కేబినెట్లో పెట్టేందుకు
కేబినెట్ నోట్ తయారీపై వివిధ మంత్రిత్వశాఖల మధ్య సంప్రదింపులు కొలిక్కి
వస్తున్నాయని, పోలవరం మొదటి దశ పరిధిలోకి వచ్చే 20,946 ముంపు బాధిత
కుటుంబాల్లో 12,658 మందిని ఇప్పటికే తరలించామని, మిగిలిన 8,288 మందిని
తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వివరించారు.
ప్రాధాన్యత ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక శ్రద్ధ: ప్రభుత్వం ప్రాధాన్యతగా
నిర్దేశించుకున్న ప్రాజెక్టుల పూర్తి ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం
వైయస్.జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి 15 రోజులకోసారి పనుల ప్రగతిని
సమీక్షించుకోవలన్నారు. ఈమేరకు కార్యాచరణ చేసుకుని వేగంగా వాటిని
పూర్తిచేయాలన్నారు. వెలగొండ, వంశధార, అవుకు సహా పలు ప్రాధాన్యతా
ప్రాజెక్టుల్లో పరిస్థితులను సీఎం సమీక్షించారు. ఈ ప్రాజెక్టుల ప్రగతిని
ముఖ్యమంత్రికి అధికారులు నివేదించారు. అవుకు రెండో టన్నెల్ నిర్మాణం పూర్తి,
చివరిదశలో లైనింగ్ కార్యక్రమం ఉందని, ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు
చేస్తున్నామని అధికారులు తెలిపారు. అవుకు ద్వారా 20వేల క్యూసెక్కుల సముద్రంలో
కలిసే కృష్ణా వరదజలాలను రాయలసీమ దుర్భిక్షప్రాంతానికి తరలించేందుకు మార్గం
సుగమమైందని, వరదలు సమయంలో సముద్రంలో కలవకుండా నీటిని కరవుపీడిత ప్రాంతాలకు
తరలించే అవకాశం ఉంటుందని, వెలిగొండ ప్రాజెక్టు పనులపై పురోభివృద్ధిని సీఎంకి
అధికారులు వివరించారు. ఇప్పటికే మొదటి టన్నెల్ పూర్తయ్యిందని, రెండోటన్నెల్
పనులుకూడా కొలిక్కివస్తున్నాయని, పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో రెండో
టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు 92.14శాతం పూర్తయ్యాని, ఆగస్టు నాటికి
హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తిచేస్తామని, టన్నెల్ తవ్వకం పనులు 18,787
మీటర్లకుగానూ, 17,461 మీటర్లు పూర్తిచేశామని అధికారులు తెలిపారు. నీటిని
తరలించడానికి వీలైనంత తర్వగా మిగిలిన పనులు త్వరగా పూర్తిచేయాలని సీఎం
ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా గొట్టిపాడు డ్యాం, కాకర్ల డ్యాం,
తీగలేరు అప్రోచ్ ఛానల్, తీగలేరు హెడ్ రెగ్యులేటర్, ఈస్ట్రన్ మెయిన్
కెనాల్ హెడ్ రెగ్యులేటర్ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయని అధికారులు
తెలిపారు.
వంశధార పనులపైనా సీఎం సమీక్ష : ఈ ఏడాది వంశధార స్టేజ్-2, ఫేజ్-2 కింద
డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ను కూడా పూర్తి చేస్తున్నామని అధికారులు
వివరించారు. గొట్టా బ్యారేజీ నుంచి కూడా ఎత్తిపోతల ద్వారా హిరమండలం
రిజర్వాయర్‌ను నింపే కార్యక్రమం వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చాలన్న సీఎం
తోటపల్లి బ్యారేజీ కింద మిగిలిపోయిన పనులు, తారకరామ తీర్థసాగర్, మహేంద్ర తనయ
రిజర్వాయర్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయని
అధికారులు తెలిపారు. వీటి తర్వాత ప్రాధాన్యతగా నిర్ణయించుకున్న
ప్రాజెక్టులపైనా సీఎం సమీక్ష చేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు దాదాపుగా
పూర్తికావొచ్చాయని అధికారులు వివరించారు. ఏపీ నాలుగు జాతీయ జల అవార్డులు
(నేషనల్ వాటర్ అవార్డ్స్ 2022) దక్కించుకోవడంపై మంత్రి, అధికారులను సీఎం
అభినందించారు. నీటి వనరుల సంరక్షణ, నిర్వహణకు గాను ఉత్తమ రాష్ట్రాల విభాగంలో
తృతీయ స్ధానంలో ఏపీ నిలిచింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉప
రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చేతుల మీదుగా జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ నారాయణ రెడ్డి అవార్డు అందుకున్నారు. ఈ
సమావేశానికి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్
జవహర్ రెడ్డి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ తదితరులు
హాజరయ్యారు.