మీ జగన్ మామ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని విద్యార్థులకు హామీ
విజయవాడలో జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
టెన్త్, ఇంటర్ స్టేట్ లెవల్ టాపర్స్‌ని సత్కరించిన సీఎం జగన్
టెన్త్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కు రూ.లక్ష
సెకండ్ ర్యాంకర్ కు రూ.75 వేలు
థర్డ్ ర్యాంకర్ కు రూ.50 వేల బహుమానం
టెన్త్ తొలి 3 స్థానాల్లో నిలిచిన 42 మంది విద్యార్థులకు సన్మానం
26 మంది ఇంటర్ టాపర్స్ కు రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం
ఉన్నత విద్య అభ్యసించిన 20 మంది విద్యార్థులకు స్టేట్ ఎక్స్ లెన్స్ అవార్డులు
విజయవాడ : మట్టిలో మొలిచిన ఈ మొక్కలు భవిష్యత్తులో ప్రపంచానికే ఫలాలు అందించే
మహావృక్షాలుగా మారాలని కోరుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్
రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన జగనన్న ఆణిముత్యాలు
కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. పదో తరగతిలో 42 మంది రాష్ట్రస్థాయి
టాపర్లు, 26 మంది ఇంటర్ విద్యార్థులకు స్వయంగా అవార్డులను అందజేసి,
సన్మానించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 20 మందికి స్టేట్ ఎక్స్‌లెన్స్
అవార్డులను సీఎం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిస్థాయుల్లో ప్రతిభ చాటిన
22,710 మంది ఆణిముత్యాల అవార్డులను మంగళవారం అందుకున్నారు. విద్యార్థులను
సన్మానించిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ
పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. కరిక్యులమ్, సిలబస్
మారిందని, ఇంగ్లిష్ మీడియం అన్ని స్కూళ్లలో అందుబాటులోకి వచ్చిందని చెప్పారు.
రాష్ట్రంలో ప్రతీ విద్యార్థికి డిగ్రీ పట్టా ఉండాలనే తాపత్రయంతో ఫీజులను
భరిస్తున్నామని వివరించారు. టెక్నాలజీని చేరువ చేసేందుకు ప్రతీ విద్యార్థికి
ట్యాబులు అందిస్తున్నట్లు తెలిపారు. విదేశీ యూనివర్సిటీలలో సీటు తెచ్చుకున్న
విద్యార్థులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆ విద్యార్థి చదువుకు అయ్యే
ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. విద్యార్థుల
చదువు కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడబోమని తేల్చిచెప్పారు. ‘మీ జగన్ మామా
ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’ అంటూ విద్యార్థులకు సీఎం జగన్ హామీ ఇచ్చారు.
ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య సంస్ధల్లో చదువుతూ రాష్ట్రస్ధాయిలో 10వ తరగతిలో
టాపర్‌గా నిలిచిన 42 మంది, ఇంటర్లో గ్రూపులు వారీగా టాపర్స్‌గా సత్తా చాటిన
26 మంది విద్యార్ధులకు “జగనన్న ఆణిముత్యాలు” అవార్డుతో సత్కారం చేశారు. వీరితో
పాటు ఉన్నత విద్యలో 5 కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన 20 మంది
విద్యార్ధులకు కూడా విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్లో “స్టేట్ ఎక్స్‌లెన్స్
అవార్డులు” కూడా ప్రదానం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి
ఘనంగా సత్కరించారు. అవార్డుల కార్యక్రమానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, ఉషా
శ్రీ చరణ్, తానేటి వనిత, మెరుగు నాగార్జున తదితరులు హాజరయ్యారు.
విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం
విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
ప్రతిభావంతులను ఎంపిక చేసి సీఎం చేతుల మీదుగా పురస్కారాలు ఇవ్వడం శుభ సందర్భం.
రేపు నేను కూడా ఇలాంటి పురస్కారం పొందాలని విద్యార్ధులలో స్ఫూర్తిని నింపే
కార్యక్రమం ఇది, పోటీతత్వం విద్యార్ధులలో పెంపొందించాలనే ఉద్దేశం అని విద్యా
శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అలాంటి విద్యార్ధులను తయారుచేసిన
అధ్యాపకులను కూడా మనస్పూర్తిగా అభినందిస్తున్నా, అధ్యాపకులు కూడా పోటీతత్వం,
అంకిత భావంతో ముందుండాలన్న ఆలోచన. విద్యార్ధుల తల్లిదండ్రుల ఆనందాన్ని
చూడాలని, మిగిలిన వారు స్పూర్తిగా తీసుకోవాలని ఈ కార్యక్రమం. సీఎం విద్య అంటే
సంక్షేమం కాదు పెట్టుబడి అని, విద్యార్ధి ఎక్కడికి వెళ్ళినా పోటీతత్వంలో
నిలబడాలంటే, మంచి బోధన అందించాలని నిర్ణయించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత
పెద్ద ఎత్తున విద్యకు ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ ఇక్కడ అందరూ గర్వపడేలా
అవకాశాలు కల్పించాం. సామాన్య కుటుంబాల నుంచి వచ్చినా ఉన్నత విద్య అందేలా
ఏర్పాట్లు చేశాం. విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం, అధునాతన విద్యా
బోధన అందుతుంది. డిజిటల్ ఎడ్యుకేషన్‌లో మన విద్యార్ధులు బాగస్వామ్యం కావాలన్న
సంకల్పం సీఎంగారిది. సీఎంకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ
సెలవు తీసుకుంటున్నానని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.