రైతులే ప్రధాన లబ్దిదారులుగా డి.సి.ఎం.ఎస్.ల వ్యాపారాన్ని విస్తరించాలి
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి
అమరావతి : రైతులకు విస్తృత సేవలు
అందజేయటమే ప్రధాన లక్ష్యంగా జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలను బలోపేతం
చేయాలని, అందుకు తగ్గట్టుగా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు
పర్చాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఆహారశుద్ధి శాఖ మంత్రి కాకాని
గోవర్ధన రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం వెలపూడిలోని ఆంద్రప్రదేశ్
సచివాలయంలో రాష్ట్ర సహకార శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్రంలోని జిల్లా సహకార
మార్కెటింగ్ సొసైటీల అద్యక్షులు, బిజినెస్ మేనేజర్లతో మంత్రి సమీక్షా సమావేశం
నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు విస్తృత సేవలు
అందజేయాలనే లక్ష్యంతో జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలను ఏర్పాటు చేయడం
జరిగిందన్నారు. అయితే కాలక్రమీణా వాటి కార్యకలాపాలు క్రమంగా తగ్గిపోతూ ఉనికి
కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఇటు వంటి పరిస్థితులను అధిగమించి
రైతులకు విస్తృత సేవలు అందజేసే విధంగా వాటిని మరింత బలోపేతంగా
తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఇందుకు అవసరమైన తగిన సూచనలు, సలహాలు
అన్ని జిల్లాల సహకార మార్కెటింగ్ సొసైటీల అద్యక్షులు, బిజినెస్ మేనేజర్లు
అందజేసి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు సహకరించాలని ఆయన
కోరారు.
ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి పలు రంగాల్లో వినూత్న సంస్కరణలను అమలు పరుస్తూ అన్ని
రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని, అదే తరహాలో జిల్లా సహకార సొసైటీల
సంస్కరణలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు. జిల్లా
సహకార సొసైటీల ఉనికిని కాపాడేందుకు వాటి ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపర్చాల్సి
ఉందని, ఈ అంశంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఆ వ్యాపార కార్యకలాపాలు
అన్నీ కూడా రైతులకు అందజేసే సేవలను విస్తృత పర్చాలనే దృక్పదంతోనే
చేపట్టాలన్నారు. జిల్లా సహకార సొసైటీల ద్వారా ప్రస్తుతం నిర్వహిస్తున్న
ఎరువుల విక్రయం, ధాన్యం కొనుగోలు కార్యకలాపాలను మరింత మెరుగుపర్చాలని, గోదాముల
వినియోగాన్ని మరింత విస్తృత పర్చాలని అధికారులకు మంత్రి సూచించారు. గిరిజన
సహకార సంస్థ పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజన్సీలను ఏర్పాటు చేయడం ద్వారా మంచి
ఆర్థిక పరిపుష్టిని సాదించడం జరిగిందని, అదే తరహాలో జిల్లా సహకార సొసైటీలు
కూడా వాటి వ్యాపార కార్యకలాపాలను విస్తృత పర్చుకొని లాభాల బాట పట్టేలా చర్యలు
తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆ విధంగా వాటి ఉనికి లాభాల భాటలో ఉంటే
రైతాంగానికి సక్రమమైన సేవలు అందుతాయనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. అదే
విధంగా జిల్లా సహకార సొసైటీల ఆస్తుల పరిరక్షణ, వాటి ద్వారా ఆదాయ వనరులను
మెరుగు పర్చుకునే అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి
సూచించారు.
రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ అహ్మద్ బాబు
మాట్లాడుతూ రాష్ట్రంలోనున్న 13 జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలు ప్రస్తుతం
నిర్వహిస్తున్న వ్యాపార కార్యకలాపాలు, వాటి ఆర్థిక స్థితి, వాటి కార్యకలాపాలను
మరింత మెరుగు పర్చుకునేందుకు చేపట్టాల్సిన చర్యలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్
ద్వారా జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీల అద్యక్షులకు, బిజినెస్ మేనేజర్లకు
వివరించారు.
రాష్ట్ర సహకార, మార్కెటింగ్ శాఖ
ప్రిన్సిఫల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్,
మార్కుఫెడ్ ఎం.డి. రాహుల్ పాండే, మార్కుఫెడ్ చైర్మన్ నాగిరెడ్డి, రాష్ట్ర
సహకార శాఖ సలహాదారులు బ్రంహ్మనంద రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.