62 వ డివిజన్ 270 సచివాలయ పరిధిలో నాలుగో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : నవరత్నాలకు ధీటైన సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు
కావడం లేదని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు
పేర్కొన్నారు. 62 వ డివిజన్ 270 వార్డు సచివాలయాల పరిధిలో స్థానిక కార్పొరేటర్
అలంపూర్ విజయలక్ష్మితో కలిసి మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
నిర్వహించారు. ప్రకాష్ నగర్లో విస్తృతంగా పర్యటించి 500 గడపలను సందర్శించారు.
ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పాలనపై ప్రజల స్పందన తెలుసుకోవడంతో పాటు
లబ్ధిదారులకు అందుతున్న సంక్షేమ పథకాలు, స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి
తెలుసుకున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణనలోకి తీసుకుంటూ,
సంబంధిత పరిష్కారాలు వెతుకుతూ ముందుకు సాగారు. గడప గడపకు మన ప్రభుత్వంలో అందే
ఫిర్యాదులను విభాగాధిపతులే నేరుగా పరిశీలించి పరిష్కరించాలని, ఏ ఒక్క ఫిర్యాదు
పునరావృతం కాకుండా బాధ్యతతో పరిష్కరించాలని మల్లాది విష్ణు సూచించారు. సైడ్
కాలువల్లో నీరు పారేలా ఎప్పటికప్పుడు మురుగు తొలగించాలని పారిశుద్ధ్య
సిబ్బందిని ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రం సందర్శన
అంగన్వాడీ కేంద్రాల బలోపేతంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
చూపుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. పర్యటనలో భాగంగా స్థానిక 618
కేంద్రాన్ని ఆయన సందర్శించారు. విద్యార్థుల వివరాలను సిబ్బందిని అడిగి
తెలుసుకున్నారు. గర్భిణీలు, బాలింతలకు అందించే పౌష్టికాహారంపై ఆరా తీశారు.
వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల ద్వారా
బలవర్ధకమైన ఆహారం అందించాలని పేర్కొన్నారు. చిన్నారులకు పప్పు ధాన్యాలు
ఆకుకూరలతో కూడిన పోషక విలువలు అధికంగా ఉండే ఆహారాన్ని అందించాలని సూచించారు.
అలాగే కేంద్రంలో అందించే సేవల గురించి స్థానికులకు విస్తృత అవగాహన కల్పించాలని
మల్లాది విష్ణు సూచించారు. ప్రధానంగా రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు ఏఏ ఆహార
పదార్ధాలు తీసుకుంటే పౌష్టికాహారం లభిస్తుందో తెలియపరచాలన్నారు. అలాగే ప్రతి
నెలా పిల్లల బరువులు, ఎత్తులు పరిశీలించి వారి పోషణ స్థితిని గుర్తించాలని
అంగన్వాడీ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబువి శవ రాజకీయాలు
ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంకెన్ని రోజులు శవ రాజకీయాలు చేస్తారని ప్లానింగ్
బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి
చేయలేని సంక్షేమం సీఎం జగన్ చేస్తున్నారన్న కడుపు మంటతో ప్రభుత్వంపై బాబు బురద
చల్లుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆల్ ఫ్రీ స్లోగన్ 2009 లోనే అట్టర్
ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం హయాంలో ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని
లూటీ చేశారని ఆరోపించారు. 2014-19 మధ్య కాలంలో ఏకంగా రూ.1.62 లక్షల కోట్లకు
లెక్కల్లేవని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించినట్లు
గుర్తుచేశారు. కాగ్ స్వయంగా ఈ విషయం బయటపెట్టిందని పేర్కొన్నారు. పదేపదే
అడిగినా కేవలం రూ.51,667 కోట్లకు మాత్రమే వివరణలు ఇచ్చారని.. పార్లమెంటు
సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించినట్లు మల్లాది విష్ణు తెలిపారు. కానీ ఈ
ప్రభుత్వం తెచ్చిన ప్రతిపైసాకు లెక్కలు చెప్పడానికి తాము సిద్ధంగా
ఉన్నామన్నారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఎదుర్కొనే సత్తా లేక
చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తూ.. మొసలి కన్నీరు కారుస్తున్నారని మల్లాది
విష్ణు నిప్పులు చెరిగారు. ఇకనైనా ప్రజలను మభ్యపెట్టే డ్రామాలను
కట్టిపెట్టాలని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో డీఈలు గురునాథం, రామకృష్ణ,
ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, డివిజన్ కోఆర్డినేటర్ వీరబాబు,
నాయకులు అలంపూర్ విజయ్, రామిరెడ్డి, మస్తాన్, రమేష్, హైమావతి, సావిత్రి,
సుభాన్, మహేష్, రెడ్డమ్మ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.