సూచనలు ఇవ్వాలని ఐసీఎంఆర్ కు మంత్రి ఆదేశం
ఐదుగురు సభ్యులతో ప్రత్యేక బృందం ఏర్పాటు
న్యూ ఢిల్లీ : దేశంలో జూన్ లోనూ వేడి వాతావరణం నెలకొంది. రుతు పవనాలు ఆలస్యం
కావడం, దేశంలో వడగాలుల తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,
ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, విదర్భ,
ఒడిశా, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో తీవ్రమైన
వేడిగాలుల నుంచి అతితీవ్రమైన వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వడగాలుల విషయంలో తీసుకోవాల్సిన
జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ ఆరోగ్య శాఖ సీనియర్
అధికారులతో పాటు, భారత వాతావరణ శాఖ సీనియర్ అధికారులు నిన్న ఉన్నత స్థాయి
సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వేడిగాలుల వల్లే ఏర్పడే ప్రతికూల
ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇవ్వాలని
కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు మంత్రి ఆదేశించారు. ఆరోగ్య శాఖ,
ఐఎండీకి చెందిన ఐదుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని మాండవీయ
చెప్పారు. వడగాలుల తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఈ ప్రత్యేక బృందం
పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తుందన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ఆయా
రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో ఈ రోజు వర్చువల్ భేటీ నిర్వహిస్తామని చెప్పారు.