విజయవాడ : పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం నమోదైన అభ్యర్థులకు రాష్ట్ర సాంకేతిక
విద్యాశాఖ రాష్ట్ర స్ధాయిలో చేపట్టిన ప్రత్యేక అవగాహనా కార్యక్రమం మంచి
ఫలితాలను ఇస్తుంది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా 15 రోజుల వినూత్న
కార్యక్రమానికి సాంకతిక విద్యా శాఖ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని
ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ముందుచూపుతో ప్రతిష్టాత్మకంగా సాంకేతిక విద్యాశాఖ ఈ
విద్యార్ధి అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాదాపు 3000 మంది పాలిసెట్
ర్యాంకర్లు ఈ క్లాసులకు హాజరవుతున్నారు. అసలు పాలిటెక్నిక్ విద్యావిధానం అంటే
ఏమిటి, ఈ కోర్సులను అభ్యసించటం వల్ల సమకూరే ఉపాధి అవకాశాలపై పూర్తి స్దాయి
అవగాహన కల్పిస్తున్నారు. పదిహేను రోజుల ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఒక అంశానికి
ప్రాధన్యతనిస్తూ పాలిసెట్ ర్యాంకర్లలలో ఛైతన్యం నింపుతున్నారు. ఇప్పటికే వారం
రోజుల తరగతులు పూర్తికాగా, అయా కళాశాలల ప్రిన్సిపల్స్, విభాగ అధిపతులు,
అధ్యాపకులు దీనిలో భాగస్వాములయ్యారు. తొలుత పాలిటెక్నిక్‌లలో అందించే
కోర్సులకు సంబంధించిన సమగ్ర అవలోకనంను దృశ్య శ్రవణ విధానంలో అందించారు. ప్రతి
కోర్సుతో అనుసంధానమైన సంభావ్య ఉపాధి అవకాశాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు.
పాలిసెట్ వెబ్ ఎంపికలు, తద్వారా సాంకేతిక విద్యా శాఖ సీట్లు కేటాయించే విధానం
పట్ల వారికి స్పష్టత వచ్చేలా అధ్యాపక, అద్యాపకేతర బృందం ఒక రోజు శిక్షణా
తరగతులు నిర్వహించింది. పూర్వ విద్యార్థులతో పరస్పర భేటీలు ఏర్పాటు చేసి
ప్రస్తుత పాలిసెట్ అభ్యర్ధులలో ఆత్మ విశ్వాసం పెంపొందించేలా వారి విజయ గాధలను
ఆవిష్కరింపచేసారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో కల్పించే వసతి, సౌకర్యాలపై వారికి
మరింత స్ఫష్టతనిస్తూ అన్నింటినీ స్వయంగా సందర్శించేలా ఏర్పాటు చేసారు. అత్యంత
కీలకమైన బౌతిక శాస్త్ర ప్రయోగశాలలో ఆచరణాత్మక విధానంలో స్వయం అనుభూతిని
పొందగలిగేలా ఒకరోజు కార్యక్రమాలను చేపట్టారు. ప్రత్యేకంగా పాలిటెక్నిక్
కోర్సులలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం, ఆవశ్యకతను వివరిస్తూ భవిష్యత్తుపై భరోసాకు
మార్గం చూపారు.
పాలిటెక్నిక్ విద్యావిధానం పై సమగ్ర అవగాహన కల్పించటమే ధ్యేయం
సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి
మూడు, నాలుగు సంవత్సరాల పాలిటెక్నిక్ విద్య, తదనంతర ఉపాధిపై పాలిసెట్
ర్యాంకర్లకు సమగ్ర అవగాహన కల్పించటమే ధ్యేయంగా ఈ పక్షం రోజుల కార్యక్రమాన్ని
ప్రవేశ పెట్టామని సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి ఈ సందర్భంగా
తెలిపారు. రెండవవారం కార్యాచరణలో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ణానం ఆలంబనగా
విద్యార్ధులలో స్వతంత్ర అధ్యయనాన్ని ప్రోత్సహించేలా కార్యక్రమాలు ఉంటాయన్నారు.
జాతీయ, అంతర్జాతీయ పోటీని తట్టుకునేలా సాంకేతిక అంశాలలో క్విజ్ పోటీలో
పాల్గొనడం పట్ల అవగాహన కల్పిస్తామన్నారు. విద్యార్థి సహాయ సేవలపై సమాచారం
అందించటంతో పాటు, ప్రభుత్వ పరంగా లభించే ఆర్థిక సహాయం, ఉపకార వేతనాలు వంటి
విషయాలపై వారికి స్పష్టత వచ్చేలా చేసి, ఆర్ధిక భారం లేకుండా విద్యను ఏలా పూర్త
చేయవచ్చన్న దానిని సాదోహరణంగా చెప్పనున్నామని నాగరాణి వివరించారు. లెర్నింగ్
మేనేజ్మెంట్ సిస్టమ్స్‌పై ప్రాక్టికల్ సెషన్లు, తల్లిదండ్రులతో పరస్పర
పరస్పర సమావేశాలు, కంప్యూటర్ ల్యాబ్‌లో ప్రాక్టికల్ సెషన్, అధ్యయన నైపుణ్యాలు,
సమయ నిర్వహణ వ్యూహాలు వంటి వాటిపై శిక్షణా కార్యక్రమాలు ఉంటాయన్నారు. రసాయన
ప్రయోగశాఖ సందర్శన, ఆరోగ్య అవగాహన కార్యక్రమం, క్యాంపస్ జీవితం, ప్రాథమికంగా
వర్క్‌షాప్ పద్ధతుల పరిచయం, ఇంజనీరింగ్ విద్యా విధానంలో తాజా పోకడలు,
విద్యార్ధుల నడుమ నేర్చుకున్న అంశాలపై పరస్పర చర్చ వంటి కార్యక్రమాలతో ఒక
సంపూర్ణ అవగాహనా కార్యక్రమానికి సాంకేతిక విద్యా శాఖ రూపకల్పన చేసిందని
నాగరాణి పేర్కోన్నారు. చివరిరోజు విద్యార్దుల నుండి ప్రశ్నలు ఆశించి,
నిపుణులతో సమాధానాలు అందిస్తామన్నారు.