బాబు
విజయవాడ : యోగా మన వారసత్వ సంపదని ఆరోగ్యవంతమైన, ఉన్నతమైన వ్యక్తిగా
తీర్చిదిద్దుకోవడానికి యోగా సరైన జీవన మార్గమని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైద్య
ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి. కృష్ణ బాబు అన్నారు. అంతర్జాతీయ
యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం ఏ కన్వెన్షన్ సెంటర్ లో ఆంధ్ర ప్రదేశ్
ప్రభుత్వ ఆయుష్ శాఖ నిర్వహించిన యోగా క్యాంప్ లో కృష్ణ బాబు ముఖ్య అతిధిగా
పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణ బాబు మాట్లాడుతూ ప్రాచీన కాలం నుండి
సంస్కృతీ సాంప్రదాయాలు ప్రజల జీవన విధానంలో ఒక భాగమన్నారు. భారత ప్రధాని
నరేంద్ర మోడి యునైటెడ్ నేషన్స్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడం
భారత దేశానికి ఎంతో గర్వకారణమన్నారు. ప్రాచీన సంపదను ఆరోగ్యపరంగా ప్రపంచ
దేశాలకు అందించిన ఘనత భారతదేశానికి దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్
రెడ్డి ప్రజలందరికీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారన్నారు.
రాష్ట్రంలో హెల్త్ వెల్ నెస్ సెంటర్ లు ఏర్పాటు చేసి సత్వర వైద్య సేవలతో పాటు
ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో గ్రామీణ
ప్రాంతాల్లో 10,032 హెల్త్ వెల్ నెస్ సెంటర్లు, పట్టణ ప్రాంతాల్లో 5,000
హెల్త్ వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ సెంటర్ల ద్వారా యోగా పై
పేద ప్రజల్లో అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. యోగా ద్వారా శారీరక
మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్య పరిస్థితులు ప్రజలకు చేకూరగలవని కృష్ణ బాబు
అన్నారు. యోగా మనందరి వారసత్వ సంపద అని తెలుగు వారికి భారత దేశానికీ అత్యంత
ప్రాధాన్యత గల అంశమన్నారు. భారత దేశ గొప్పతనం మన జీవన శైలిని విదేశీయులు
అనుసరిస్తున్నారన్నారు. యోగా ప్రతీ వ్యక్తికీ ప్రతీ కుటుంబానికి అవసరమని
ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంలో అందరూ ఆచరించవలసిన అవసరం ఉందన్నారు.
ప్రాచీన కాలంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో ప్రజలకు శారీరక శ్రమ తగ్గిందని ఈ
పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ ప్రతీ రోజూ 45 నిమిషాల పాటు వారికి నచ్చిన
పద్ధతుల్లో యోగా కానీ వ్యాయామం గానీ చేస్తే ఆరోగ్యవంతంగా జీవించగలరని ఎం.టి.
కృష్ణ బాబు అన్నారు.
రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు
మల్లాది విష్ణువర్ధన్ మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా అంతర్జాతీయంగా యోగా
దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏకైక మార్గం
యోగా అని అన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి జగన్ మోహన్
రెడ్డి ఆకాంక్ష అన్నారు. ఇందుకు అనుగుణంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైద్య
ఆరోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుందన్నారు. యోగా పట్ల ప్రజలు,
విద్యార్థుల్లో అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. ఆయుష్ శాఖ ద్వారా
రాష్ట్రం లోని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో నెలకు ఒకసారైనా యోగా క్యాంపులు
నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించవలసిన బాధ్యత ఆయుష్ శాఖపై ఉందన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, హెల్త్ వెల్ నెస్ సెంటర్ల
ద్వారా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం చేపట్టిందన్నారు.
రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో యోగా సెంటర్లు ఏర్పాటు చేసి భోధకులను నియమించి
వాటి నిర్వహణా బాధ్యతను ఆయుష్ శాఖ చేపట్టాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి
అమెరికాలో ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొనడం మనందరికీ గర్వకారణమన్నారు.
రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చి దిద్దాలన్నదే
ప్రభుత్వ లక్ష్యమని మల్లాది విష్ణు అన్నారు.
ఎన్ టి ఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు మాట్లాడుతూ 9వ అంతర్జాతీయ యోగా
దినోత్సవాన్ని విజయవాడలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భారతదేశ
గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మన సంస్కృతిలో యోగా ఒక బాగామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లు, హెల్త్ వెల్
నెస్ సెంటర్ల ద్వారా యోగా పై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టనున్నామని
కలెక్టర్ అన్నారు. ఆయుష్ శాఖ కమీషనర్ డా. ఎస్.బి. రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ
రాష్ట్ర స్థాయిలో విజయవాడలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని
జరుపుకున్నామన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాలతో పాటుగా ఆయు:ష్ శాఖ
ఆధ్వర్యంలో 104 హెల్త్ వెల్ నెస్ సెంటర్లలో కూడా యోగా దినోత్సవాలు రాష్ట్ర
వ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు.
ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసనసభ్యులు
వెలంపల్లి శ్రీనివాసరావు, డా. వై.ఎస్.ఆర్. హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్
డా. కోరుకొండ బాబ్జి, స్థానిక కార్పొరేటర్, గుంటూరు బుద్ద యోగా ఫౌండేషన్
విద్యార్థులు, స్థానిక విద్యార్థులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన
చేసి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి ఎం.టి. కృష్ణ బాబు ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి
సామూహిక యోగా క్యాంపు లో పాల్గొన్నారు. అనంతరం ఆరోగ్యవంతమైన ఉన్నతమైన
వ్యక్తిగా తీర్చి దిద్దుకోవడానికి యోగా సరి అయిన జీవన మార్గమని నమ్ముచున్నానని
యోగా యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ప్రతి ఒక్కరి చేత ప్రతిజ్ఞ చేయించారు.