15 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదు
ఈ నెల 24 నుంచి నెల రోజులపాటు ‘జగనన్న సురక్ష’
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి
ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లకు సీఎం దిశానిర్దేశం
గుంటూరు : గడప గడపకు మన ప్రభుత్వంపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ
సందర్భంగా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లకు సీఎం
దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించాలని సీఎం
ఆదేశించారు. జగనన్న సురక్ష తర్వాత మరో కార్యక్రమం ఉంటుందన్నారు.
గడప గడపకు కార్యక్రమం అత్యంత కీలకం. ఈ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలి.
చాలా ఉపయోగపడే కార్యక్రమం. వచ్చే 9 నెలలు అత్యంత కీలకం. 175కి 175 సీట్లు
కచ్చితంగా గెలవాలి. పనితీరు బాగుంటే ఎమ్మెల్యేలను కొనసాగిస్తాం. కొన్ని కోట్ల
మంది మనపై ఆధారపడి ఉన్నారు. కోట్ల మంది పేదలకు మంచి జరుగుతోందని సీఎం అన్నారు.
‘‘కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేకపోతే కొనసాగించడం వల్ల వారికీ నష్టం,
పార్టీకి నష్టం. సర్వే చేసినప్పుడు మీమీ గ్రాఫ్లు బలంగా ఉండాలి. దీని కోసం
గడపగడపకు కార్యక్రమం ఉపయోగపడుతుంది. ప్రజలకు చేరువగా ఉండేందుకు చాలా
ఉపయోగపడుతుంది. దీనివల్ల మీ గ్రాఫ్ పెరుగుతుంది. పార్టీకి మేలు జరుగుతుంది.
అలా జరగకపోతే మార్చక తప్పని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
15 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదు : గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై
సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరుపై చర్చించారు.
ఈసారి 15 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని, మెరుగుపడితేనే టికెట్లు
ఇస్తానని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు మళ్లీ సర్వే
చేయించనున్నట్లు తెలిపిన సీఎం గెలుస్తారని తేలినవారికే టికెట్లు ఇవ్వనున్నట్లు
జగన్ చెప్పినట్లు సమాచారం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణలో 15
మంది ఎమ్మెల్యేలు వెనుకబడ్డారని, ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. వచ్చే సమీక్ష
నాటికి పనితీరు మెరుగు పరుచుకోవాలని వారికి సూచించారు. పనితీరు మార్చుకోని
ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేల
పనితీరుపై ఎన్నికల ముందు సర్వే చేయిస్తానని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. గడప
గడపకు కొనసాగింపుగా చేపడుతున్న జగనన్న సురక్ష కార్యక్రమంపై వాలంటీర్లకు శిక్షణ
ఇవ్వాలని సీఎం నిర్దేశించారు. ఈ నెల 24 నుంచి నెల రోజులపాటు ‘జగనన్న సురక్ష’
చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన కుల, ఆదాయ, జనన, మరణ, వివాహ
ధ్రువపత్రాలు, రేషన్ కార్డుల్లో పేర్ల నమోదు, కార్డుల విభజన సహా 11 రకాల
ధ్రువపత్రాలు వెంటనే జారీ చేయాలని స్పష్టంచేశారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’
కార్యక్రమంపై సీఎం జగన్ నిర్వహించిన సమీక్షకు వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ
ఇన్ఛార్జులు హాజరయ్యారు.