విద్యుత్ ఉద్యోగసంఘాల జెఎసి ప్రతినిధులతో మంత్రులు పెద్దిరెడ్డి
రామచంద్రారెడ్డి, కారుమూరు నాగేశ్వరరావు భేటీ
హాజరైన పలు విద్యుత్ ఉద్యోగసంఘాల ప్రతినిధులు
పేరివిజన్ పై చర్చలు
ఉద్యోగుల డిమాండ్ పై సీఎం దృష్టికి తీసుకువెళతాం
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమరావతి : విద్యుత్ ఉద్యోగసంఘాల ప్రతినిధులతో సచివాలయంలో ఇంధనశాఖ మంత్రి
పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి, పౌర సరఫరాలశాఖ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు
భేటీ అయ్యారు. ఈ సందర్బంగా విద్యుత్ ఉద్యోగసంఘాలు, పలు అసోసియేషన్లకు చెందిన
ప్రతినిధులు ఉద్యోగుల డిమాండ్లను మంత్రులకు వివరించారు. ప్రస్తుత విధానం
కొనసాగిస్తూ సింగిల్ మాస్టర్ స్కేల్ అమలు చేయాలని కోరారు. జెన్ కో ఉద్యోగులకు
అలవెన్స్ లు, ఇతర అలవెన్స్ లను యథాతధంగా కొనసాగించాలని, వెయిటేజీతో పాటు ఫిట్
మెంట్లను కొనసాగించాలని, అలాకాని పక్షంలో అధిక ఫిట్ మెంట్ ఇవ్వాలని కోరారు.
ఇంధనశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ మాట్లాడుతూ ప్రస్తుతం విద్యుత్
రంగం ఆర్థిక పరిస్థితిని అర్థంచేసుకుని ఉద్యోగులు సహకరించాలని కోరారు.
ఆర్థికంగా లోటుతో ఉన్న విద్యుత్ రంగాన్ని కాపాడుకునేందుకు అన్ని రకాల ఖర్చులను
తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అదే క్రమంలో ఉద్యోగుల డిమాండ్ లను
కూడా ప్రభుత్వం సానుకూలంగానే పరిశీలిస్తోందని తెలిపారు. అనంతరం మంత్రి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగసంఘాల డిమాండ్ లను ముఖ్యమంత్రి
దృష్టికి తీసుకువెడతామని అన్నారు. వారం రోజుల్లో మరోసారి ఉద్యోగసంఘాల
ప్రతినిధులతో భేటీ ఏర్పాటు చేస్తామని, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు
తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే వన్ మెన్ కమిషన్ నివేదికపై ఉద్యోగసంఘాలు
అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దానిని పూర్తిస్థాయిలో పరిగణలోకి
తీసుకోవడం లేదని వివరించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ
కె.విజయానంద్, జెన్క్ ఎండి, ట్రాన్స్ కో జెఎండి చక్రధర్ బాబు, ఇపిడిసిఎల్
సిఎండి పృథ్వితేజ్, ట్రాన్స్ కో జెఎండి (విజిలెన్స్) మల్లారెడ్డి తదితరులు
పాల్గొన్నారు.