హెచ్-1బీ వీసా రెన్యూవల్ విధానాన్ని మరింత సరళీకరించే దిశగా అగ్రరాజ్యం
స్వదేశానికి వెళ్లకుండానే వీసా రెన్యూ చేసుకునేందుకు ఎన్నారైలకు అవకాశం
ఈ దిశగా పైలట్ ప్రాజెక్టు ప్రారంభించనున్న అమెరికా
త్వరలో దీనిపై విస్పష్ట ప్రకటన విడుదల కానున్నట్టు సంబంధిత వర్గాల వెల్లడి
భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో అక్కడి ఎన్నారైలకు ఓ గుడ్ న్యూస్!
త్వరలో భారతీయుల వీసా కష్టాలు తీరనున్నాయి. హెచ్-1బీ వీసా రెన్యూవల్
విధానాన్ని మరింతగా సరళీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు సంబంధిత
వర్గాలు పేర్కొన్నాయి. ఈ దిశగా త్వరలో ఓ పైలట్ ప్రాజెక్టును ప్రభుత్వం
ప్రారంభించబోతోందని, ఇందులో భాగంగా స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే
ఎన్నారైలు తమ వీసాలను రెన్యూవల్ చేసుకునే అవకాశం దక్కనుందని సమాచారం.
పైలట్ ప్రాజెక్టు తొలి విడతలో భాగంగా కొద్ది మంది విదేశీయులకు ఈ అవకాశం
కల్పించనున్నారు. ఈ విషయమై నేడే అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన వెలువరించే అవకాశం
ఉన్నట్టు కూడా తెలుస్తోంది. హెచ్-1బీ వీసాదారుల్లో మెజారిటీ భారతీయులేనన్న
విషయం తెలిసిందే. గతేడాది జారీ అయిన 4.42 లక్షల హెచ్-1బీ వీసాల్లో అత్యధికం
భారతీయులే దక్కించుకున్నారు.